సూపర్ ఎల్‌నినోతో 100 దేశాలకు ముప్పు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సూపర్ ఎల్‌నినోతో 100 దేశాలకు ముప్పు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లా, చింతకాని: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాలకు వాతావరణ ముప్పు పొంచి ఉందని, రాబోయే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉందని భట్టి విక్రమార్క హెచ్చరించారు. వర్షాలు సరిగా కురవకపోతే చెరువులు, కుంటలు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి ప్రతి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నీటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటేనే భవిష్యత్తులో తాగునీటి అవసరాలను తీర్చుకోగలమని పేర్కొన్నారు. మనుషులతో పాటు పశుపక్ష్యాదులు, వన్యప్రాణుల దాహార్తిని తీర్చేలా నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఎల్‌నినో ప్రభావంపై శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నీటి సంరక్షణపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సంభవించే విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడంతో పాటు సమష్టి కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలను కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో అంశంపై రాజకీయాలు చేయకుండా, ప్రజలకు అండగా నిలవాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల్లో భరోసా కల్పించాలని సూచించారు.

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడంతో పాటు క్యాబినెట్ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి సమయంలోనూ ముందస్తు హెచ్చరికలు చేసి, విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి సహకరించామని ఆయన గుర్తుచేశారు. అదే విధంగా ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కూడా ప్రజలు సహకరించాలని కోరారు.