రేప్ చేస్తామని తోటి ఉద్యోగుల బెదిరింపు: BHEL ఉద్యోగి నేహా ఆత్మహత్య

రేప్ చేస్తామని తోటి ఉద్యోగుల బెదిరింపు: BHEL ఉద్యోగి నేహా ఆత్మహత్య
  • ఫోన్ హ్యాక్ చేసి.. నిత్యం వేధింపులు
  • పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదు
  • రేప్ చేసి సాక్ష్యం దొరక్కుండా చంపేస్తామని వార్నింగ్
  • డీజీఎం సహా 8 మంది పేర్లు డైరీలో రాసి బలవన్మరణం

హైదరాబాద్: తోటి ఉద్యోగుల లైంగిక వేధింపులు తట్టుకోలేక BHEL ఉద్యోగి నేహా ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ లోని భాను టౌన్ షిప్ లోని తన నివాసంలో బుధవారం రాత్రి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. కొన్నాళ్లుగా తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ రేప్ చేస్తామని బెదిరింస్తున్నారంటూ డైరీలో మరణ వాంగ్మూలం రాసింది.

బీహెచ్ఈఎల్ లో అకౌంట్ సెక్షన్ లో పని చేస్తోంది నేహా. ఆమె స్వస్థలం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్ బీహెచ్ఈఎల్ కు ట్రాన్సఫర్ పై వచ్చింది. మియాపూర్ భాను టౌన్ షిప్ లో నివాసం ఉంటూ ఆఫీసుకు వెళ్లేదామె. తన ఆఫీసులో డీజీఎం కిశోర్ సహా ఎనిమిది మంది సహోద్యోగులు తనను వేధిస్తున్నారని డైరీ లో రాసింది.

ఫోన్ హ్యాక్ చేసి.. వేధింపులు

డీజీఎం కిశోర్ తన ఫోన్ హ్యాక్ చేసి పర్సనల్ వివరాలన్నీ కూడా తెలుసుకుని, నిత్యం వేధిస్తున్నారని నేహా డైరీలో రాసింది. ‘వేధింపులపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే తీసుకోలేదు. ఇది సైబర్ క్రైం పరిధిలోకి వస్తుందని చెప్పారు. వారి చెప్పినట్టే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించా. కానీ వారు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఫోన్ మార్చి మళ్లీ ఇలాంటిది జరిగితే చెప్పమన్నారు’ అని డైరీలో రాసుకుందామె.

రెండ్రోజుల ముందు తనను రేప్ చేస్తామని బెదిరించారని, చంపేసి ఆధారాలు కూడా లేకుండా చేస్తామని బెదిరించారని పేర్కొంది. తన జీవితాన్ని నరక ప్రాయం చేశారని, తట్టుకోలేక చచ్చిపోతున్నానని డైరీలో రాసుకుంది. తన చావుకు కిశోర్ సహా ఎనిమిది మంది కారణమని, వారినెవ్వరీని విడిచిపెట్టొద్దని డైరీలో రాసింది.

తన భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు, తమ్ముడు అందరినీ చాలా ప్రేమిస్తున్నానని, ఈ పని చేసినందుకు తనని క్షమించాలని కోరింది.