
- నేడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం
హైదరాబాద్, వెలుగు: సుదీర్ఘ విరామం తర్వాత ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (టీఏసీ) మీటింగ్ సోమవారం జరగనుంది. ఎస్టీ వెల్ఫేర్ మంత్రి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో రాష్ట్రంలో ఉన్న ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్టేట్ ట్రైబల్ సెక్రటరీ, కేంద్ర ట్రైబల్ శాఖ డైరెక్టర్, ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, మెంబర్ సెక్రటరీగా స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్లు ఇలా మొత్తం 15 మంది ఉన్నారు.
హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో జరగనున్న ఈ మీటింగ్‌కు చైర్మన్ హోదాలో ఎస్టీ వెల్ఫేర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మెంబర్ హోదాలో మంత్రి సీతక్కతో పాటు ప్రజా ప్రతనిధులు హాజరు కానున్నారు. ఈ మీటింగ్ ఏడాదికి ఒకసారి జరగాల్సి ఉండగా చివరిసారిగా 2020లో జరిగిందని, ఐదేండ్ల తర్వాత ఈ కమిటీ మీటింగ్ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. మూడేండ్ల పాటు టర్మ్ ఉండే ఈ కమిటీని గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. గతేడాది ఈ కమిటీని రెన్యువల్ చేస్తూ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ ఉత్తర్వలు జారీ చేశారు. కాగా, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరు, ఐటీడీఏలు, ట్రైబల్ ఏరియాల్లో విద్య, వైద్యం, హౌసింగ్, విద్యుత్, ఫారెస్ట్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, దేవాదాయ శాఖల స్కీమ్‌లు, ఉద్యోగాలు, ఉపాధి వంటి అంశాలను మీటింగ్‌లో చర్చించనున్నారు.