
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా రాజిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, HMDA సెక్రటరీగా కోటా శ్రీవత్స, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా శృతి ఓజా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్యను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ కమిషనర్ గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్ను మెట్రో ఎండీగా ప్రభుత్వం నియమించడం గమనార్హం.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుతో తీవ్రంగా నష్టపోయిన ఎల్ అండ్ టీ, తన వాటాలను విక్రయించేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించిన సమయంలో మెట్రో ఎండీ మార్పు చర్చనీయాంశమైంది. ఎల్ అండ్ టీ తన వాటాలను రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని కోరుతోంది. భారీగా నష్టాలు వస్తుండడం, అప్పులు పెరిగిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త స్పెషల్ పర్పోజ్ వెహికల్ (ఎస్‌పీవీ) ద్వారా ఈ విక్రయం జరగాలని కోరింది. ఇందుకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్‌కు లెటర్ పంపింది.