జీతాలకు మించి లోన్లు ..ఈఎంఐకి తిప్పలు!..ఏఐ ప్రభావంతో ఉద్యోగులకు తిప్పలు

జీతాలకు మించి లోన్లు ..ఈఎంఐకి తిప్పలు!..ఏఐ ప్రభావంతో ఉద్యోగులకు తిప్పలు
  • సాఫ్ట్​వేర్​ ఉద్యోగుల్లోనే ఎక్కువజాబ్​ రాగానే కార్లు, బైక్​లు, ఫ్లాట్ల కొనుగోళ్లకు లోన్లు
  • ఏఐ ఎఫెక్ట్​తో జాబ్స్ కోల్పోతున్న టెకీలు​
  • తరువాత ఇన్​స్టాల్​మెంట్స్​ కట్టలేక ఇబ్బందులు
  • ఇతర రంగాల్లోనూ అదే పరిస్థితి
  • ఈఎంఐల ఆలస్యంపై బ్యాంకర్ల కమిటీలోనూ చర్చ

హైదరాబాద్, వెలుగు:  తీసుకున్న లోన్లకు ఈఎంఐలు కట్టలేక సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా, ఇతర రంగాల్లోనూ కొనసాగుతోంది. ఫలితంగా బ్యాంకుల్లో వాయిదాలు పెరిగిపోవడం, కొన్నిసార్లు నిరర్థక ఆస్తులుగా(ఎన్​పీఏ) మిగిలిపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోవడం, ఇతర ఆర్థిక కారణాల వల్ల ఈ సమస్య మరింత జటిలమవుతోంది. ఈఎంఐల ఆలస్యంపై బ్యాంకర్ల కమిటీలో కూడా చర్చలు జరుగుతున్నాయంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాప్ట్​వేర్​ రంగంలో ఎక్కువ ఇలాంటి సమస్యలు రావడంపై ఇటీవల దీనిపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో కూడా చర్చ జరిగింది. కొత్తగా ఉద్యోగం రాగానే ఖరీదైన బైక్‌‌‌‌లు, కార్లు, స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లు, అపార్ట్‌‌‌‌మెంట్లు కొనడానికి వెంటనే లోన్లు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో జీతాలు ఇంకా పెరుగుతాయన్న నమ్మకంతో ఒకదాని తర్వాత ఒకటి వచ్చే జీతాలకు మించి లోన్లు తీసుకుంటూ పోతున్నారు. కానీ, ఇటీవలి కాలంలో ఏఐ టెక్నాలజీ పెరుగుదలతో ఉద్యోగుల పనితీరు, అవసరంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.  దీంతో అప్పటివరకూ తీసుకున్న లోన్లకు ఈఎంఐల సర్దుబాటు కష్టంగా మారుతోంది. తక్కువ శాలరీకైనా వెంటనే ఇంకో ఉద్యోగం దొరికినోళ్లు తక్కువ ఇబ్బంది పడుతుండగా.. అసలు జాబ్​ దొరకక  కొంతమంది రెండు, మూడు నెలలకొసారి ఒక ఈఎంఐ చెల్లింపులు చేస్తున్నారు. మరికొంతమందివి అసలు చెల్లింపులు చేయక ఎన్​పీఏల్లోకి వెళ్తున్నాయి. హౌసింగ్​ లోన్లలో రూ.1,350 కోట్లు ఎన్​పీఏలుగా (నిరర్ధక ఆస్తులు) మారగా.. అందులో ఎక్కువ శాతం సాఫ్ట్‌‌‌‌వేర్ ఉద్యోగులవే ఉన్నట్టు సమాచారం. పర్సనల్ లోన్లలోనూ రూ.1,810 కోట్లు ఎన్​పీఏల కింద ఉండిపోగా, కార్లు, ఇతర విలువైన ఇంటి సామాన్ల కోసం తీసుకున్న లోన్లు రూ.30 వేల కోట్లకు పైగా ఎన్​పీఏలుగా ఉన్నట్టు ఎస్​ఎల్​బీసీ లెక్కలు చెబుతున్నాయి.

ఏఐ ప్రభావంతో ఉద్యోగులకు తిప్పలు

ప్రస్తుతం చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ తొలగింపులకు ఏఐ ప్రధాన కారణం అవుతోంది. ఏఐ అందుబాటులోకి రావడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగుల అవసరాన్ని తగ్గించుకుని, ఆ పనిని ఏఐతో చేయిస్తున్నాయి. దీంతో చాలా మంది సాఫ్ట్​వేర్ ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఏఐతో సులభంగా చేయగలిగే పనులను చేసే ఉద్యోగులు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ప్రభావంతో  టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించడం ఇప్పుడు సాధారణమైపోయింది.  

మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ ఏడాదిలో సుమారు 15 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక గూగుల్ కూడా తమ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు దశల్లో ఉద్యోగులను తొలగించింది. ఇంటెల్ దాదాపు 24 వేల మందిని తగ్గించాలని యోచిస్తోంది. అదేవిధంగా, అమెజాన్ తన వెబ్ సర్వీసెస్  విభాగంలో వందలాది ఉద్యోగాలకు కోత పెట్టింది. ఒరాకిల్ సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఇండియాలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టేందుకు దాదాపు 2,800 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ పెద్ద కంపెనీలతో పాటు హైదరాబాద్‌‌‌‌లోని అనేక చిన్న, మధ్య స్థాయి ఐటీ సంస్థలు కూడా ఏఐ కారణంగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి.  ఫలితంగా, ఉద్యోగం కోల్పోయినవారు లోన్ల వాయిదాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఉద్యోగం పోయినవారు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి చాలా సమయం పడుతోంది. ఈ గ్యాప్‌‌‌‌లో  నిత్యావసర ఖర్చులతో పాటు ఈఎంఐలు కట్టలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.  ఉద్యోగం పోయినప్పుడు లేదా జీతం తగ్గినప్పుడు అప్పుల వాయిదాలు కట్టడం పెద్ద సవాలుగా మారుతోంది.

2023లో రాహుల్‌‌‌‌కి మంచి ప్యాకేజీతో ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వెంటనే  కొన్ని రోజులకు రూ.70 లక్షల ఫ్లాట్​ తీసుకున్నాడు.  ప్రతినెలా శాలరీలో సగం ఈఎంఐకే పోతుంది. ఈ ఏడాది అతని కంపెనీలో ఉద్యోగులను తగ్గించే ప్రక్రియ ప్రారంభమైంది. రాహుల్ కూడా అందులో ఉన్నాడు.  ఇప్పుడు ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఈఎంఐలు కట్టడం అతడికి పెద్ద సవాల్‌‌‌‌గా మారింది. ప్రస్తుతం ఉన్న అప్పులు తీర్చడానికి చిన్న ఉద్యోగాలు వెతక్కుంటున్నాడు.   

శైలజ, ఒక చిన్న ఐటీ కంపెనీలో టెక్నికల్ రైటర్‌‌‌‌గా పనిచేస్తోంది. ఆమె కొత్త కొత్త గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కోవడానికి చాలా పర్సనల్ లోన్లు తీసుకుంది. కానీ, ఆటోమేషన్ కారణంగా ఆమె ఉద్యోగం ప్రమాదంలో పడింది. ఏఐ టూల్స్ వల్ల ఆమె చేసే పని సులభంగా చేయవచ్చని కంపెనీ భావించింది. దీనితో శైలజ ఉద్యోగం పోయింది. చిన్న చిన్న మొత్తాలుగా తీసుకున్న లోన్లు అన్నీ కలిపి ఒక పెద్ద భారం అయ్యాయి. ఈఎంఐలు కట్టలేక ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతోంది. 

రవి కిశోర్, ఐటీ ఉద్యోగి. మంచి జీతం రావడంతో షేర్ మార్కెట్‌‌‌‌లో పెట్టుబడి పెట్టడానికి పర్సనల్ లోన్ తీసుకున్నాడు. మొదట్లో లాభాలు వచ్చాయి, కానీ, మార్కెట్‌‌‌‌లో ఊహించని నష్టాలు రావడంతో అతను లోన్ తీర్చలేకపోయాడు. అదే సమయంలో, ఏఐ టూల్స్ వల్ల అతని కంపెనీలో చాలా పనులు సులభతరం అయ్యాయి. దీంతో అతడి ప్రాజెక్టు మూతపడింది. అతను ఉద్యోగం కోల్పోయి, వ్యక్తిగత రుణాలను, నష్టాలను తీర్చలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
 

ఆనంద్, హైదరాబాద్​లోని ఒక స్టార్టప్‌‌‌‌లో మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే ఒక లగ్జరీ కారును లోన్ తీసుకొని కొనుక్కున్నాడు. అతను కారు లోన్‌‌‌‌ ఈఎంఐతో పాటు తన పర్సనల్ లోన్ కూడా కడుతున్నాడు. అయితే, ఊహించని విధంగా అతని కంపెనీలో ఏఐ ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల కోత మొదలైంది. ఆనంద్ ఉద్యోగం పోయింది. మొదటి రెండు నెలలు తన పొదుపుతో ఈఎంఐలు కట్టాడు. కానీ, ఆ తరువాత డబ్బులు లేక ఇబ్బందులు పడ్డాడు. కారు లోన్ కిస్తీలు ఆలస్యం కావడంతో బ్యాంక్ నుంచి నోటీసులు రావడం మొదలయ్యాయి.