
- రైతు, పంట వివరాలతో స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకాలు
- రద్దీని కంట్రోల్ చేయడం, అక్రమాలను అడ్డుకునే అవకాశం
- అక్టోబర్1 నుంచి రైతుల అవగాహనకు చర్యలు
- రాష్ట్ర వ్యాప్తంగా 45.47 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
మంచిర్యాల, వెలుగు : పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ‘కపాస్ కిసాన్’ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సీజన్‌లో పత్తి అమ్ముకోవాలనుకునే రైతులు తమ వివరాలతో పాటు, పంట సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. తద్వారా సెంటర్ల దగ్గర రైతుల రద్దీని కంట్రోల్ చేయడమే కాకుండా అక్రమాలను అడ్డుకోవచ్చని సీసీఐ భావిస్తోంది.
పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్‌ను స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక ముందుగా తమ పేరు, జండర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అడ్రస్, ఆధార్, మొబైల్ నంబర్, అడ్రస్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత తాము ఏ మార్కెట్లేదా సెంటర్‌లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఆ వివరాలను కూడా యాప్‌లో ఎంటర్ చేయాలి. అలాగే ఫార్మర్ టైప్(సొంతమా, కౌలుదారా), పట్టాదార్ పాస్‌బుక్ నంబర్, సర్వే నంబర్, కొలత రకం, రైతుకు ఉన్న మొత్తం భూమి, అందులో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం (ట్రెడిషనల్, హెచ్‌డీపీఎస్, దేశీ కాటన్, క్లోజర్ స్పేసింగ్) వంటి వివరాలు సైతం ర్స్పేసింగ్) వివరాలు సైతం నమోదు చేయాలి. అదే విధంగా రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, పాస్‌బుక్, రైతు ఫొటోను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
స్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోళ్లు
సీసీఐకి పత్తి అమ్ముకునే రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలి. యాప్‌లో సెలెక్ట్ చేసుకున్న మిల్లు, తేదీ, టైంలోనే రైతుకు సంబంధించిన పత్తి కొనుగోళ్లను అనుమతిస్తారు. ఒక వేళ స్లాట్ బుక్ చేసుకోకపోతే పత్తి అమ్ముకునే చాన్స్ ఉండదు. స్లాట్ బుకింగ్ కారణంగా సీసీఐ సెంటర్ల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సిన అవస్థలు తప్పనున్నాయి. రైతులు స్మార్ట్ ఫోన్ ద్వారా స్వయంగా లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ల వద్దకు వెళ్లి స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. అక్టోబర్ఒకటి నుంచి పత్తి సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.
45.47 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
రాష్ర్టవ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 45.47 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరానికి సగటున 8 క్వింటాళ్ల చొప్పున సుమారు 36.50 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాలో 1.61 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా... 1.33 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. జిల్లాలో నాలుగు సీసీఐ సెంటర్లను ఏర్పాటుచేసి వాటి పరిధిలోని 11 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. వీటిలో రోజుకు 20 వేల టన్నుల పత్తి కొనుగోలు చేసే కెపాసిటీ ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్టోబర్ నెలాఖరు నుంచి పత్తి మార్కెట్‌కు వస్తుందన్న అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నారు.
మంచిర్యాలలో సీసీఐ సెంటర్లు
మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి దండేపల్లిలోని వెంకటేశ్వర కాటన్ మిల్లు, చెన్నూర్‌లోని చెన్నూర్కాటన్ కంపెనీ, జీఆర్‌ఆర్ ఇండస్ట్రీస్, నవదుర్గ మిల్లు, శ్రీఆదిశంకరాచార్య కాటన్ అండ్ ఆయిల్‌మిల్, వరలక్ష్మి ఇండస్ట్రీస్, అలాగే ఇందారంలోని బాలాజీ కాటన్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ సెంటర్లు ఉన్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి తాండూర్‌లో సీసీఐ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడున్న శ్రీరామ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్, మహేశ్వర కాటన్ మిల్లు, వైభవ్ ఫైబర్, కన్నెపల్లిలోని ఆదినాథ్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లు
చేపట్టనున్నారు.