
చరిత్ర గతమే కాదు వర్తమానం కూడా అని నిరూపిస్తోంది తెలంగాణ. తెలంగాణ వాదమంతా గత కాలపు విశేషాల మీదే నిలబడింది. సెప్టెంబరు మాసం వచ్చినప్పుడల్లా ఆపరేషన్ పోలో గుర్తుకొస్తుంది. నిజాం రాజుని గుర్తుచేస్తుంది. గతం వర్తమానాన్నే కాదు భవిష్యత్ను కూడా శాసిస్తుందని ఇప్పుడా విలీన కాలాన్ని గుర్తు చేస్తున్నారు. విలీనం, విమోచన, విద్రోహం పేరుతో ఎవరెవరు ఏ కామెంట్ చేసినా ఘటన మాత్రం ఒక్కటే. ఆ వాదవివాదాలకు ప్రామాణికమైన సెప్టెంబరు 17కి ముందు, వెనుక ఏం జరిగిందో చూద్దాం.
నిజాం రాజుల అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే ఉంది. భవనాలు, సేవా సంస్థలతో హైదరాబాద్ ఆధునిక నగరంగా ఉన్నా గ్రామాలు మాత్రం వేల ఏండ్ల నాటి భూస్వామ్య విధానాలతో ఉన్నాయి. జాగీర్దార్ల చేతుల్లో వేల ఎకరాలు ఉండేవి. గ్రామాల్లో పటేళ్లు, పట్వారీల పెత్తనం సాగేది. వాళ్ల ఆగడాలకు హద్దే లేదు. గడీల్లోని దొరల దాష్టీకాలు పెచ్చు మీరుతుండేవి. భూమి లేని పేదలు బతకాలంటే వెట్టి చాకిరీ చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. నిజాం కాలంలో పాలనా భాషగానే కాకుండా విద్యాభాషగా కూడా ఉర్దూ అమలులో ఉంది. అత్యధికులైన తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారు. ఈ పరిస్థితుల్లో భాషాభిమానం, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్ర జనసంఘం 1921లో ఏర్పడింది. ఇది 1930 నాటికి ఆంధ్ర మహాసభగా మారింది.
గ్రామీణ సమాజంలో కింది కులాల వారిని వెట్టి చాకిరి చేయించేవాళ్లు, గడీలలో సంబురాలు జరిగితే అన్ని కులాల వాళ్లు ఉచితంగా సేవలు చేయాల్సి ఉండేది. ఈ వెట్టి చాకిరీ, భూస్వాముల ఆగడాలే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలు, కమ్యూనిస్టులు గ్రామీణ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడంతో వాళ్లకు ప్రజల్లో ఆదరణ లభించింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణరెడ్డి నాయకత్వంలో నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడింది. తొలుత వెట్టికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నప్పుడు దొరల నుంచి, రజాకార్ల నుంచి సంఘంపై దాడులు జరిగాయి.
కడివెండిలో జరిపిన కాల్పుల్లో రెట్టి కొమురయ్య అమరుడైనాడు. ఈ మరణంతో ప్రతిఘటించేందుకు కావాల్సిన శిక్షణ ఉండాలని యువతను కూడగట్టింది. రజాకార్లకు ఈ సమాచారం తెలిసి శిక్షణా శిబిరాలపై తల్వార్లు, బరిసెలు తీసుకుని దాడులకు తెగబడ్డారు. అప్పుడు ప్రజలు రజాకార్లకు వ్యతిరేకంగా నిలబడ్డారు. రజాకార్ల దాడులను తట్టుకోవాలంటే ఆయుధం పట్టాలని సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. దొడ్డి కొమురయ్య మరణం ఉద్యమాన్ని మలుపుతిప్పింది. నల్లగొండ, వరంగల్లు జిల్లాల్లో ఉద్యమం వేడెక్కింది.