
హైదరాబాద్, వెలుగు: ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు అంటే కేసీఆర్ తమపై అరిచారని చెప్పారు. తెలంగాణకు బీజేపీ పనికివచ్చే పార్టీ కాదని అన్నారు. బీఆర్ఎస్ భావజాలం వేరు.. బీజేపీ భావజాలం వేరని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్ లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రమేశ్ఒక మనిషేనా? అని ఫైర్ అయ్యారు. చిన్న, పెద్ద బ్రోకర్లు మాట్లాడితే పట్టించుకోవద్దని వ్యాఖ్యానించారు. సీఎం రమేశ్ ఇంటికి తాను కూడా మిత్రుడిగా వెళ్లానని చెప్పారు. ఆయన ఇంటికి కేటీఆర్ లేదా తాను వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు.
కేటీఆర్ భాషలో తప్పు లేదు
కేటీఆర్ భాష విషయంలో ఒక్క అక్షరం కూడా తప్పు లేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో బీజేపీ ఎంపీ మధ్యవర్తిత్వం వహించారని కేటీఆర్ ముందే చెప్పారన్నారు. “పథకం ప్రకారం బీజేపీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నడపడంలో కేసీఆర్ కీలకం అవుతారు. తాత్కాలికంగా మీరు నాలుగు రోజులు సంతోషపడవచ్చు. బీజేపీ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతామన్నా కేసీఆర్ ఒప్పుకోరు. కులగజ్జి నాయకులు వాళ్లే. కులం ప్రస్తావన తెలంగాణ రాజకీయాల్లో ఉందా? ఏపీలో కులం గురించే మాట్లాడతారు. ఆ కులగజ్జి ఇప్పుడు శిష్యుడు రేవంత్‌రెడ్డికి అంటుకున్నది. ఇప్పుడు ఎవరెవరు రెచ్చిపోతున్నారో వాళ్ల సంగతి తేలుస్తాం” అని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.