
కరోనా కష్టకాలంలో.. చేస్తున్న డ్రైవర్ ఉద్యోగం పోయింది. ఏం చేయాలో తోచని పరిస్థితిలో బిజు యూట్యూబ్ చానెల్ పెట్టాడు. ఫ్యామిలీ మొత్తం అతనికి అండగా నిలబడింది. తన సెల్ ఫోన్లో ఫ్యామిలీ మెంబర్స్ తో బ్లాగ్స్ తీసి, అప్లోడ్ చేసేవాడు. వాళ్లమధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయత, కల్మషం లేని ప్రేమ.. ఆ కుటుంబాన్ని కొన్ని కోట్ల మందికి చేరువయ్యేలా చేశాయి. ఇప్పుడు వాళ్ల చానెల్ ఏడున్నరకోట్ల మంది సబ్ స్క్రైబర్‌లతో దేశంలోని టాప్ చానెళ్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది.
కేరళలోని కన్నూరుకు దగ్గరలో ఉన్న మయ్యిల్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు బిజు. నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యత అతనిపై పడింది. బతుకుదెరువు కోసం ప్రైవేట్ బస్సు డ్రైవర్ గా పనిచేసేవాడు. బిజుకి చిన్నప్పటినుంచి యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండేది. కొన్ని నాటకాల్లో నటించాడు. కానీ.. పెద్దగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత కర్నాటకకు చెందిన కవితని పెండ్లి చేసుకున్నాడు.
డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు ఆమె సలహాతోనే సరదాగా వీడియోలు చేసి, టిక్టాక్ అప్లోడ్ చేసేవాడు. అలా ఒక్క సంవత్సరంలోనే దాదాపు 380 వీడియోలు చేశాడు. కానీ.. వాటికి పెద్దగా వ్యూస్ రాలేదు. 2020లో కరోనా వల్ల చేస్తున్న డ్రైవర్ ఉద్యోగం కూడా కోల్పోయాడు. ఏం చేయాలో తోచలేదు. ఆ టైంలో అతనికి ఫ్యామిలీ, ముఖ్యంగా భార్య కవిత ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది అంటాడు బిజు:
ఎన్నో సవాళ్లు
బిజు యూట్యూబ్ జర్నీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవైపు పనిలేక ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు వీడియోలు తీయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. పైగా చానెల్ పెట్టేముందే బిజు వీడియోలు తీయడానికి వాడిన ఫోన్ పాడైపోయింది. కొత్తది కొనడానికి చేతిలో డబ్బు కూడా లేదు. అప్పుడు తన ఫ్రెండ్ రషీద్ ఆ విషయం తెలుసుకుని సాయం చేశాడు. అందుకే అతని సాయానికి గుర్తుగా రషీద్ వెహికల్ పేరు "కెఎల్ బ్రో"ని చానెల్ పేరులో యాడ్ చేసుకున్నాడు బిజు.
ఇన్ ఫ్లు యెన్సర్
కరోనా టైంలోనే టిక్ టాక్ కూడా పాస్ అయ్యింది. దాంతో చాలామంది యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడే బిజు కూడా 'కేఎల్ బ్రో బిజు రిత్విడ్ పేరుతో ఒక చానెల్ పెట్టాడు. ఒక బేసిక్ స్మార్ట్ ఫోన్ తీసిన తన మొదటి వీడియోని 2020 ఆగస్టు 2న అప్లోడ్ చేశాడు. దానికి పెద్దగా వ్యూస్ రాలేదు. అయినా.. వెనకడుగు వేయలేదు. కుటుంబంలో అందరూ కష్టపడి వీడియోలు చేశారు. వాటిలో తల్లి కార్త్యాయని, భార్య కవిత, కొరుకు రిత్వికు ఎక్కువగా కనిపించేవాళ్లు.
తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్
ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటన్నింటిని ఎదుర్కొని నిలబడ్డాడు బిజు. దాంతో కొన్నాళ్లకు ఛానెల్ ప్రజాదరణ పొందింది. నాలుగేండ్లలోనే అంటే 2024లో 50 మిలియన్ సబ్స్క్రయిబర్ల మైలురాయిని దాటి ఇండియాలోని టాప్ చానెళ్ల లిస్ట్లో చేరింది. ప్రతిష్టాత్మకమైన రూబీ ప్లే బటన్ అందుకున్నాడు బిజు. అంతేకాదు.. ఇండివిడ్యువల్ చానెళ్ల కేటగిరీలో అత్యధికంగా వ్యూస్ సాధించిన వీడియో కూడా తన చానెల్లోనే ఉంది.
కుటుంబ విలువలు
చానెల్ ఇంతలా సక్సెస్ కావడానికి కారణం.. వీడియోల్లో ఎంటర్టైన్మెంట్ తోపాటు కుటుంబ విలువలను బాగా చూపిం చడమే. బిజు ఫ్యామిలీ తన సబ్ స్క్రైబర్లను కూడా తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. వాళ్లను "అమ్మలు, చెల్లెళ్లు, అన్నలు" అ ని సంబోధిస్తారు. అంతేకాదు.. వాళ్ల వీడియోల్లో ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో ఉండే చిన్న చిన్న ఆనందాలు, వాళ్లు ఎదుర్కొనే సవాళ్లనే ఎక్కువగా చూపిస్తారు. వీడియోలో బిజు తల్లి, భార్య,పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు మేకప్ లేకుండానే కనిపిస్తారు. వాళ్ల చిరునవ్వుల్లో నటన కనిపించదు. నిజమైన ఆనందమే కనిపిస్తుంది. అందుకే సబ్స్క్రయిబర్స్ చానెల్ తో విడ దీయలేని బంధాన్ని ఏర్పరుచుకున్నారు.
వన్-మ్యాన్ షో
కెమెరా వెనుక చేసే ప్రతి పనిని ఒక్కడే తన భుజాలపై మోస్తున్నాడు బీజు. స్క్రిప్ట్, వీడియో షూటింగ్, లైటింగ్,, డైరెక్షన్, ఎడిటింగ్, యాక్టింగ్.. అన్నింటిలో బిజు మార్క్ కనిపిస్తుంది. ఛానెల్కు పెద్ద సక్సెస్ వచ్చినా ఇప్పటికీ ఆయన పనులన్నీ తానే చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు చానెల్లో 3,231 వీడియోలు అప్లోడ్ చేశారు. వాటిలో బిలియన్ వ్యూస్ దాటిన షార్ట్ వీడియోలు ఐదు ఉన్నాయి. 'కేఎల్ ట్రో బిజు రిత్విక్' 75 మిలియన్ల సబ్ స్కైబర్లతో ఇండియా లోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ గా నిలిచింది.