
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రా గా ముగిసింది. ఇంగ్లాండ్ విజయం ఖాయమన్న ఈ మ్యాచ్ లో ఇండియా అద్భుతం చేసింది. 143 ఓవర్ల పాటు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకొని డ్రా చేసుకోగలిగింది. నాలుగో రోజు గిల్ (103), రాహుల్ (90) భారీ భాగస్వామ్యంతో టీమిండియా డ్రా పై ఆశలు పెంచుకుంది. ఐదో వీరిద్దరూ ఔటైనా జడేజా (107), సుందర్ (101) ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి మ్యాచ్ ను డ్రా గా ముగించారు.
తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులు వెనకబడిన మన జట్టు రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లను 425 పరుగుల వద్ద ఐదో రోజు ముగించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 124 పరుగుల లీడ్ సాధించింది. మూడో రోజు గిల్ తో పాటు జడేజా, సుందర్ సెంచరీల మోత మోగించడం విశేషం. ఐదు రోజుల ఆటలో ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ ను డ్రా అయింది.
ALSO READ | IND vs ENG 2025: 47 ఏళ్ళ తర్వాత అరుదైన ఘనత.. సెంచరీతో బ్రాడ్‌మాన్, గవాస్కర్ సరసన గిల్
మ్యాచ్ డ్రా కావడంతో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్ట్ జూలై 31 న ఓవల్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 358 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 669 పరుగుల భారీ స్కోర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.
రాహుల్, గిల్ ఔట్:
2 వికెట్ల నష్టానికి 174 పరుగులతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తొలి అరగంట జాగ్రత్తగానే ఆడింది. నాలుగో రోజు మాదిరి ఐదో రోజు కూడా గిల్, రాహుల్ డిఫెన్స్ కే పరిమితమయ్యారు. 70 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడీని ఎట్టకేలకు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ విడగొట్టాడు. రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ వేసిన ఒక ఇన్ స్వింగ్ డెలివరీ అనూహ్యంగా లోపలికి దూసుకొచ్చింది. దీంతో రాహుల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరగడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. లంచ్ కు ముందు జోఫ్రా ఆర్చర్ సెంచరీ చేసిన గిల్(103) ను ఔట్ చేసి ఇండియాకు షాక్ ఇచ్చాడు.
జడేజా, సుందర్ పోరాటం:
4 వికెట్ల నష్టానికి 222 పరుగులతో చివరి రోజు రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా ఈ సెషన్ లో వికెట్ కోల్పోకుండా 100 పరుగులు చేసింది. జడేజా, సుందర్ మరీ డిఫెన్స్ కే పరిమితం కాకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ టీ విరామానికి ముందు తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
జడేజా, సుందర్ సెంచరీలు:
4 వికెట్ల నష్టానికి 322 పరుగులతో చివరి సెషన్ ప్రారంభించిన ఇండియాను సుందర్, జడేజా ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ మూడో సెషన్ లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా జడేజా వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలో మొదట జడేజా తర్వాత సుందర్ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.