
సికింద్రాబాద్: అక్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తున్న మరొక టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రం (ఇండియన్ స్పర్మ్ టెక్) బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ స్పర్మ్ టెక్లో అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని ఇండియన్ స్పర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోనీని కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడు మందిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు.
గత కొంతకాలంగా ఇండియన్ స్పర్మ్ టెక్ నుంచి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఇండియన్స్ స్పర్మ్ టెక్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పంకజ్, సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను పోలీసులు అరెస్ట్ చేశారు.
వీర్యకణాలను, అండాలను గుజరాత్, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్లోని ఐవీఎఫ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూశాయి. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్‌లో పోలీసులు దాడులు చేయగా ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్‌లో స్పెర్మ్ సేకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. స్పెర్మ్ డోనర్లకు 4 వేల రూపాయల వరకు ఈ ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ చెల్లింపులు చేసినట్లు తేలింది.