
- ట్యాంకర్ ఢీకొనడంతో తండ్రీకూతుళ్ల మృతి
- రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘటన
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ట్యాంకర్ ఢీకొనడంతో తండ్రీకూతుళ్లు మృతి చెందారు. ఈ ప్రమాదంలో లారీ టైర్ల కింద ఇరుక్కుని యువతి ఆర్తనాదాలు చేయడం స్థానికులను కలచివేసింది. షాద్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీకి చెందిన మచ్చేందర్ (48) కుమార్తె మైత్రి (20) శంషాబాద్ వర్ధమాన్ కాలేజీలో బీటెక్ చదువుతోంది.
తన కుమార్తెను కాలేజీకి పంపించేందుకు మచ్చేందర్ బైక్‌పై శనివారం ఉదయం బస్టాప్‌కు బయలుదేరారు. షాద్‌నగర్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా, ట్యాంకర్నిర్లక్ష్యంగా వస్తూ వీరిని ముందు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మచ్చేందర్ స్పాట్లోనే మృతి చెందగా, మైత్రికి తీవ్రగాయాలై లారీ టైర్ల మధ్యలో ఇరుక్కు పోయింది.
ఈ క్రమంలో అతికష్టం మీద అక్కడున్న ఒక వ్యక్తికి ఫోన్ఇచ్చి తన వాళ్లకు ఫోన్‌చేయాలని, కాపాడండి అంటూ ప్రాధేయపడింది. అదే సమయంలో తన ఫ్రెండ్స్‌నుంచి మైత్రికి ఫోన్లు రావడంతో.. స్థానికులు ప్రమాదం విషయం చెప్పారు. కాసేపటికి మైత్రి కూడా కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.