
న్యూఢిల్లీ: భారత ఫార్మా కంపెనీలు సన్ ఫార్మా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కొన్ని ఉత్పత్తులను తయారీ సమస్యల కారణంగా, ఇతర ప్రొడక్ట్‌లు కలిసిపోవడం వలన అమెరికాలో రీకాల్ చేస్తున్నాయి. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ప్రకారం, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ (ముంబై) అమెరికాలో 5,448 బాటిల్స్ లిస్డెక్సాంఫెటమైన్ డైమెసైలేట్ క్యాప్సూల్స్‌ను (60 ఎంజీని) రీకాల్ చేస్తోంది.
ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) చికిత్సకు ఉపయోగపడుతుంది. లుపిన్ ఫార్మాస్యూటికల్స్ (ముంబై) 58,968 బాటిల్స్ లిసినోప్రిల్, హైడ్రోక్లోరోథియాజైడ్ టాబ్లెట్లను (20ఎంజీ/12.5ఎంజీ) రీకాల్ చేస్తోంది. వీటిని హై బ్లడ్ ప్రెషర్ చికిత్సలో ఉపయోగిస్తారు. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (ప్రిన్స్‌టన్) 1,476 బాటిల్స్ ఒమేప్రజోల్ డిలేయ్డ్-రిలీజ్ క్యాప్సూల్స్‌ను రీకాల్ చేస్తోంది. వీటిని కడుపు, ఎస్ఫోగస్ సమస్యలకు చికిత్సలో వాడతారు.