
ఈ మధ్య ఒక సినిమా చూసి థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి చూసి నెటిజన్లు వాళ్ల స్టయిల్లో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సినిమా చూసేటప్పుడు ఏడ్చేవాళ్లు “బలహీనులు” అని కొందరు ట్యాగ్ ఇస్తున్నారు. ఇందులో నిజమెంత?
సినిమా చూసేటప్పుడు రకరకాల ఎమోషన్స్ ఫీల్ అవుతాం. కామెడీ సీన్కి నవ్వుతాం. సీరియస్ సీన్ వస్తే ఏకాగ్రతతో చూస్తాం. వయొలెన్స్ వచ్చినప్పుడు కొందరు చూడడానికి ఇబ్బందిపడతారు. ఇవన్నీ బయటకు ఎక్సప్రెస్ చేసే ఎమోషన్లే. కానీ, ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా ఏడిస్తే “సినిమాలో జరిగేదానికి తెగ ఫీల్ అయిపోతున్నారేంటి? ఎమోషనల్గా చాలా వీక్ పర్సన్" అనుకుంటారు.
కానీ, అది నిజం కాదు. ఒక సినిమా లేదా ఇంకేదైనా స్టోరీలో ఎమోషనల్ సీన్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఏడవడం చాలా సహజం అంటున్నారు మానసిక నిపుణులు. అందుకు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయంటున్నారు.
ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపూ ఒక క్యారెక్టర్తో పాటు ట్రావెల్ అవుతుంటారు. వాళ్ల అనుభవాలు, ఎమోషన్కు కనెక్ట్ అవుతారు. ఆ టైంలో వాళ్ల బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయి. ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ని గమనిస్తూ ఉంటాయి. అలా చూస్తున్న వాళ్లను పూర్తిగా లీనమయ్యేలా చేస్తాయి. దాంతో స్క్రీన్ మీద కనపడే ఎమోషన్ని ప్రేక్షకులు బయటకు చూపిస్తారు.
అలాగే.. న్యూరో సైంటిస్ట్ల స్టడీస్ ప్రకారం ఎమోషనల్గా ఎంగేజ్ చేసే సినిమాలు చూస్తున్నప్పుడు ఆక్సిటోసిన్, కార్టిసాల్ అనే న్యూరో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. కార్టిసాల్ అనేది ప్రతిస్పందించేలా అటెన్షన్, ఫోకసిని పెంచుతుంది. అదే టైంలో లవ్ హార్మోన్గా చెప్పుకునే ఆక్సిటోసిన్ బాండింగ్, ఎంపతీ, సోషల్ కనెక్షన్కి ప్రభావితమయ్యేలా చేస్తుంది. దాంతో క్యారెక్టర్లో లీనమయ్యి వాళ్ల లైఫ్ని, ఇబ్బందుల్ని తమవే అన్నట్టు భావిస్తారు.
సినిమా చూసి ఏడవడం ఏంటి? కామెడీ కాకపోతే అనుకుంటారు చాలామంది. అలా ఏడ్చేవాళ్లను బలహీనులు గా చూస్తారు. కానీ, రీసెర్చ్ ఏం చెప్తుందంటే.. సినిమాలు చూసేటప్పుడు ఏడ్చేవాళ్లకు నిజజీవితంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ అని.. అంటే వాళ్లు ఎమోషనల్ గా బలవంతులు అని అర్థం.
అలాంటివాళ్లు ప్రతీది గుర్తిస్తారు. అర్థం చేసుకుంటారు. వాళ్ల ఎమోషన్స్ని సొంతంగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. అంతేకాదు అవతలి వాళ్ల ఎమోషన్స్ ని కూడా మేనేజ్ చేయగలరు. ఎమోషనల్ కంటెంట్ చూసి ఎంపతీ పొందడం, నిమగ్నమవ్వడం అనేవి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని సూచించే ముఖ్యమైన అంశాలు. కాబట్టి ఎప్పుడైనా సినిమా చూసేటప్పుడు నవ్వొస్తే ఎలా నవ్వుతారో.. అలానే ఏడుపొచ్చినా ఏడ్చేయండి పర్వాలేదు.