యూఎస్‌‌‌‌తో ట్రేడ్ డీల్‌‌‌‌లో ఇండియా జర జాగ్రత్త

యూఎస్‌‌‌‌తో ట్రేడ్ డీల్‌‌‌‌లో ఇండియా జర జాగ్రత్త
  • డీల్ ముగిశాక ఉమ్మడిగా రాతపూర్వక ప్రకటన ఉండాలి: జీటీఆర్‌‌ఐ
  •  యూఎస్, జపాన్‌‌‌‌ ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌లో ఉన్నది ఒకటి.. ట్రంప్ ప్రకటించింది మరొకటి
  • ఇంకా డీల్‌‌‌‌ చర్చల్లోనే ఉందంటున్న జపాన్ క్యాబినెట్‌‌‌‌
  • 550 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయన్న ట్రంప్‌‌‌‌


న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య చర్చల్లో వియత్నాం, జపాన్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని  జాగ్రత్తగా  వ్యవహరించాలని గ్లోబల్‌‌‌‌ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్‌‌‌‌ (జీటీఆర్‌‌‌‌‌‌‌‌ఐ) ఇండియాను హెచ్చరించింది. ఈ సంస్థ  ప్రకారం, డీల్​ పూర్తయ్యక ఉమ్మడిగా జారీ చేసిన రాతపూర్వక ప్రకటన ఉండాలని ఇండియా పట్టుబట్టాలి.  తద్వారా తప్పుడు అవగాహనలను నివారించవచ్చు. జీటీఆర్‌‌‌‌‌‌‌‌ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ  మాట్లాడుతూ,  ‘‘జపాన్–యూఎస్‌‌‌‌ కొత్త వాణిజ్య ఒప్పందంపై జపాన్ అవగాహన, జులై 22న అధ్యక్షుడు ట్రంప్ వర్ణించిన విధానం మధ్య  పెద్ద గ్యాప్ కనిపిస్తోంది. జపాన్ ప్రభుత్వం ఈ నెల 25న విడుదల చేసిన డాక్యుమెంట్ బట్టి ఈ విషయం అర్థమవుతోంది.   జపాన్‌‌‌‌తో ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌లో భాగంగా  భారీ పెట్టుబడులు వస్తాయని ట్రంప్ ప్రకటించారు.

  టారిఫ్‌‌‌‌ల నుంచి రక్షణ ఉంటుందని, యూఎస్  వ్యవసాయ ఎగుమతులకు (బియ్యం సహా) కచ్చితమైన అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ, జపాన్ క్యాబినెట్ సెక్రటేరియట్ సమాచారం ప్రకారం, ఈ ఒప్పందం లిమిటెడ్‌‌‌‌ ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌లో ఉంది. ఇంకా చర్చల్లోనే ఉంది, బైండింగ్ కమిట్‌‌‌‌మెంట్లు లేవు” అని వివరించారు.  ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం  భారత్, అమెరికా చర్చలు జరుపుతున్నాయి.  ఈ ఏడాది సెప్టెంబర్-–అక్టోబర్ నాటికి ట్రేడ్ డీల్‌‌‌‌లో మొదటి దశను  ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జీటీఆర్‌‌‌‌‌‌‌‌ఐ సలహా ప్రకారం, ఒప్పందం వివరాలు స్పష్టంగా, ఉమ్మడిగా రాతపూర్వకంగా నమోదు చేయాలి. తద్వారా ఒప్పందం  నిజమైన స్వరూపం,  పరిధి గురించి ఏ విధమైన గందరగోళం ఉండదు. అలానే ట్రంప్ చేసే తప్పుడు ప్రకటనల నుంచి బయటపడొచ్చు.