
చేవెళ్ల, వెలుగు : ఉచిత కరెంట్ పేటెంట్ హక్కులు కాంగ్రెస్‌కే ఉన్నాయని ఆ పార్టీ చేవెళ్ల అభ్యర్థి పామెన భీం భరత్ తెలిపారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని చిన్న సోలిపేట, పెద్ద సోలిపేట, మద్దూర్, హైతాబాద్, నాందర్ ఖాన్ పేట, దామర్లపల్లి, మాచన్ పల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భీం భరత్ మాట్లాడుతూ.. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కరెంట్ విషయంలో కాంగ్రెస్‌పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీనేని తెలిపారు.
కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంట్ ఇస్తారని చెబుతూ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మూడోసారి మోసం చేసేందుకు బీఆర్‌ఎస్ నాయకులు వస్తున్నారని.. ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత సున్నపు వసంతం మాట్లాడుతూ.. చేవెళ్లలో భీం భరత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఈ సందర్భంగా ముడిమ్యాల్, చన్వెల్లి గ్రామాలకు చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు భీం భరత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన వెంట పీసీసీ కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.