రెండేండ్ల నుంచి పంటకు బీమా బంద్​

రెండేండ్ల నుంచి పంటకు బీమా బంద్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పునాసల సీజన్‌‌‌‌ షురువైనా పంటల బీమా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చడంలేదు. ఈ సీజన్​లో మే 5 నాటికే విడుదల కావాల్సిన పంటల బీమా నోటిఫికేషన్ ఇప్పటికీ రాలేదు.  రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లుగా ఫసల్ బీమా యోజనను అమలు చేయడంలేదు. బెంగాల్ తరహాలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా పంటల బీమా పథకం తెస్తామని చెప్తున్నా.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. దీంతో పంటలకు బీమా లేక.. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో ఏటా మన రైతులు నష్టపోతున్నారు.  

2020 నుంచీ బంద్ 

రైతులకు భరోసా ఇవ్వడం కోసం పంటల బీమా తప్పనిసరిగా అమలు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. గతంలో జాతీయ పంటల బీమా పథకం అమలులో ఉండగా, 2016 నుంచీ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా, యూనిఫైడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (యూ‌‌‌‌ఐ‌‌‌‌ఎస్) పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో 2016- నుంచి 2019 వరకు నాలుగేళ్ల పాటు ఫసల్‌‌‌‌ బీమా పథకాన్ని అమలు చేశారు. ఆ తర్వాత 2020 వానాకాలం నుంచీ పంటల బీమా పథకాలన్నింటినీ పక్కనపెట్టేశారు. 

పంటల బీమాకు పైసా ఇయ్యలే 

రాష్ట్ర రైతులు 2020 ఖరీఫ్, రబీ సీజన్లలో భారీ వర్షాలు, వడగండ్లు, ఈదురుగాలులతో భారీగా నష్టపోయారు. 2021లో పలు జిల్లాలో అకాల వర్షాలతో వరి, పత్తి, మిరప రైతులకు తీవ్రంగా నష్టం కలిగింది. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించిన మంత్రులు.. పరిహారం అందిస్తామని హామీలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇన్​పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం బంద్ పెట్టింది. గడిచిన రెండేండ్లలో పంటల బీమాకు బడ్జెట్​లో రూపాయి కూడా కేటాయించలేదు.   

బీమాతో ధీమా ఇయ్యాలె 

అన్ని పంటలను గ్రామం యూనిట్​గా పంటల బీమా పరిధిలోకి తేవడం ద్వారా రైతుల్లో భరోసా కల్పించాలని, ఇందుకోసం రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో ఒక  బీమా కంపెనీని ఏర్పాటు చేయాలని అగ్రికల్చర్ ఎక్స్ పర్ట్ లు డిమాండ్ చేస్తున్నారు. సన్న, చిన్న కారు, కౌలు, దళిత, ఆదివాసీ, మహిళా రైతులకు సర్కారే బీమా ప్రీమియం చెల్లించాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. కోతులు, అడవిపందులు, నెమళ్ల వల్ల జరిగే నష్టాన్ని కూడా బీమా పరిధిలోకి తేవాలంటున్నారు.

ఏపీలో రైతులకు సర్కార్ భరోసా

ఏపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఈ–క్రాప్‌‌‌‌లో నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తోంది. పంటనష్టాన్ని సైంటిఫిక్​గా అంచనా వేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బీమా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏ సీజన్‌‌‌‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌‌‌‌ ముగిసేలోపే నేరుగా వారి ఖాతాల్లో పరిహారం సొమ్మును జమ చేస్తున్నారు. నిరుడు ఖరీఫ్‌‌‌‌లో ప్రకృతి విపత్తులు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతులకు మంగళవారం రూ.2,977.82 కోట్ల బీమా పరిహారం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.