టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ జోష్ ఉంది. ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తోంది. గత ఏడాది దర్శకుడు రాజ్ నిడిమోరు ను వివాహం చేసుకున్న సామ్, పెళ్లి తర్వాత తన మొదటి న్యూ ఇయర్ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంది.
లిస్బన్ వీధుల్లో సందడి..
2026 కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఈ జంట విదేశీ గడ్డను ఎంచుకుంది. పోర్చుగల్ రాజధాని లిస్బన్ నగరంలో సామ్, రాజ్ సందడి చేశారు. అక్కడి చారిత్రక కట్టడాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఈ జంట దిగిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా సామ్ షేర్ చేసిన ఒక వీడియోలో, భర్త రాజ్‌తో కలిసి ఆమె నవ్వుతూ, ఎంతో సంతోషంగా కనిపిస్తున్న తీరు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సామ్ ముఖంలో ఈ నవ్వు కోసమే మేము వేచి చూస్తున్నాం అంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్లతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : స్మితతో కలిసి రఘురామ కృష్ణంరాజు మాస్ స్టెప్పులు..
నటిగానే కాదు.. నిర్మాతగానూ బిజీ!
వృత్తిపరంగా కూడా సమంత కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. ప్రస్తుతం ఆమె రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉంది . అందులో ఒకటి 'మా ఇంటి బంగారం' ఈ సినిమా సమంతకు చాలా ప్రత్యేకం. ఇందులో ఆమె కథానాయికగా నటించడమే కాకుండా, స్వయంగా తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తోంది. తన ఆప్తమిత్రురాలు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరొకటి బాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్స్ రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న భారీ పీరియడికల్ వెబ్ సిరీస్ 'రక్త బ్రహ్మాండం' లో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఇండియన్ డిజిటల్ స్పేస్‌లో ఒక కొత్త రికార్డు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఫిట్‌నెస్ మంత్రం.. 2026 లక్ష్యం!
కేవలం సినిమాలే కాకుండా, సమంత తన ఫిట్‌నెస్ , వెల్‌నెస్ పట్ల ఎంత నిబద్ధతతో ఉంటుందో మనకు తెలిసిందే. తాజాగా తన సోషల్ మీడియాలో ఒక ఇన్స్‌పిరేషనల్ పోస్ట్ షేర్ చేసింది. "2026లో తమను తాము అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోవాలనుకునే వారి కోసం మేము ఒక క్రమబద్ధమైన ప్రణాళికను రూపొందించాం. క్రమశిక్షణ, ఆరోగ్యం, సరైన అలవాట్లు , స్థిరత్వం ద్వారానే గొప్ప మార్పు సాధ్యమవుతుంది. ఇప్పుడే మాతో కలిసి ప్రయాణం ప్రారంభించండి అని పిలుపునిచ్చింది.
ఆరోగ్యం, మైండ్-బాడీ బ్యాలెన్స్, వ్యక్తిగత ఎదుగుదల పట్ల ఆమె చూపిస్తున్న ఈ శ్రద్ధ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఒకవైపు కెరీర్, మరోవైపు వ్యక్తిగత జీవితం, ఇంకోవైపు ఫిట్‌నెస్ గోల్స్‌తో సమంత 2026ని తన నామ సంవత్సరం చేసుకునేలా కనిపిస్తోంది.
