
కెరీర్ స్టార్ట్ చేసి పద్దెనిమిదేళ్లు దాటినా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది తమన్నా. ఆమె నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘భోళా శంకర్’ ఒకటి. ఇందులో చిరంజీవికి జంటగా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. శనివారంతో తమన్నా డబ్బింగ్ చెప్పడం పూర్తయిందని దర్శకుడు మెహర్ రమేష్ తెలియజేశాడు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో ఉన్న వీరిద్దరి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న సినిమా విడుదల కానుంది. మరోవైపు రజినీకాంత్‌కి జంటగా తమన్నా నటించిన ‘జైలర్’ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకొస్తుంది. స్టార్ హీరోలతో ఆమె నటించిన రెండు క్రేజీ సినిమాలు ఒకరోజు తేడాతో రిలీజ్ అవుతుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రాల నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఓ బాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది తమన్నా. జాన్ అబ్రహం హీరోగా నిఖిల్ అద్వానీ తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘వేదా’లో తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. అసీమ్ అరోరా కథను అందించగా జీ స్టూడియాస్, ఎమ్మాయ్ ఎంటర్ టైన్మెంట్, జేఏ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.