జనగామ, వెలుగు: జనగామ మున్సిపాలిటీని గెలుచుకుంటామని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ లకావత్ ధన్వంతితో కలిసి జనగామ మున్సిపాలిటీలో పోటీ చేసే 21 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను ఆయన రిలీజ్ చేసి, మాట్లాడారు. వామపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకున్నామని తెలిపారు. మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో సీపీఎం 3, సీపీఐకి ఒక వార్డు కేటాయించామని చెప్పారు. మిగిలిన 26 వార్డులకు 21 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. మరో ఐదుగురిని ఎంపిక చేస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక ఏ ఒక్కరిదో కాదని, అందరం కలిసి సమిష్టిగా ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారో వారినే ఎంపిక చేశామని తెలిపారు.
పార్టీకి అందరూ సమానేమనని, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పరిస్థితులను గమనించి ఎంపికపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. టికెట్ ఆశించడం తప్పుకాదని, పార్టీ నిర్ణయాన్ని గౌరవించి టికెట్ కేటాయించిన వారి గెలుపు కోసం నామినేషన్ వేసిన వారు ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. నామినేషన్లను ఉపసంహరించుకున్న వారి రాజకీయ భవిష్యత్ తాము చూసుకుంటామని, పార్టీ పదవులు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచాడని ఎంపీ ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి గెలవాల్సి ఉంటే, డబ్బులు విచ్చలవిడిగా పంచి, దొంగ ఓట్లు వేయించుకొని పల్లా గెలిచాడని తెలిపారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పిలిపిస్తే ఆందోళనలు చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరికి జాతిపిత అంటూ కామెంట్ చేశారు. ఆత్మగౌరవం ఒక్క కేసీఆర్‌కే ఉందా..? మిగతావారికి లేదా..? అంటూ ప్రశ్నించారు. గద్దర్‌ను ఇంటి గేటు బయట ఆపినప్పుడు, కోదండరాంను అరెస్ట్ చేయించినప్పుడు వారి ఆత్మగౌరవం గురించి ఆలోచించారా..? అంటూ నిలదీశారు. సిట్ నోటీసులను రాజకీయం చేసి సెంటిమెంట్ రగిల్చి మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు.
