ఉప ఎన్నిక వస్తేనే నిధులొస్తయ్,  పనులైతయ్​

ఉప ఎన్నిక వస్తేనే నిధులొస్తయ్,  పనులైతయ్​
  • టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిని నిలదీసిన దేశ్​ముఖ్​ గ్రామస్తులు
  • రోడ్డు మంచిగ లేక బస్సు కూడా వస్తలేదని ఆవేదన

యాదాద్రి : భువనగిరి టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిని భూదాన్​ పోచంపల్లి మండలం దేశ్​ముఖ్​ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎనిమిదేండ్లుగా రోడ్డు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘రోడ్డు వేయించు.. లేకుంటే రాజీనామా చెయ్​” అంటూ నిలదీశారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుందని, అప్పుడు గ్రామాభివృద్ధి కోసం ఫండ్స్​ వస్తాయని, పనులు జరుగుతాయని అన్నారు.  ఎమ్మెల్యేను అడ్డుకున్న వారిలో టీఆర్​ఎస్​ లీడర్లు, కార్యకర్తలు కూడా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్​ పోచంపల్లి మండలంలోని బాటసింగారం, దేశ్​ముఖ్ గ్రామాల​నుంచి పిలాయిపల్లి వరకు 4 కిలోమీటర్ల రోడ్డు గుంతలు పడి దారుణంగా మారింది. దీంతో ఊరికి స్కూల్​ బస్సు రావడం లేదు. ఎనిమిదేండ్లుగా ఈ రోడ్డును ఎవరూ  పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే శేఖర్​రెడ్డికి ఎన్నిమార్లు చెప్పినా స్పందించలేదని, కనీసం ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని గ్రామస్తులు అంటున్నారు. బుధవారం దేశ్​ముఖ్​ గ్రామంలోని సాయి బృందావనం ఆలయంలో మంత్రి సబితారెడ్డి ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు  ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్​రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు రోడ్డుపై ఆయన కారును అడ్డుకున్నారు.

రోడ్డు సమస్యలను వివరించగా.. ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘‘రోడ్డు వేయించడం చేతకాకుంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే ఫండ్స్​వస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా చేశారు. మీరు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. ఉప ఎన్నిక వస్తే డెవలప్​మెంట్​ కోసం ఫండ్స్​ వస్తాయి. రోడ్డు బాగుపడుతుంది” అని గ్రామస్తులు అనడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. ‘‘ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి.. గో బ్యాక్’’​ అంటూ   నినాదాలు చేశారు. గ్రామానికి రోడ్డులేక బస్సులు రావడంలేదని, స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు, పనులకు వెళ్లేందుకు జనం అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే రోడ్డు వేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.