రైతులకు గుడ్ న్యూస్ : జనవరిలో భూ భారతి యాప్... అన్ని ఆప్షన్లతో కొత్త ఏడాది అందుబాటులోకి తెస్తాం.

రైతులకు గుడ్ న్యూస్ : జనవరిలో భూ భారతి యాప్... అన్ని ఆప్షన్లతో కొత్త ఏడాది అందుబాటులోకి తెస్తాం.
  • .మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వెల్లడి
  • ఒకే గొడుగు కిందికి రెవెన్యూ, సర్వే, స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ విభాగాలు
  • ఈ మూడింటి కోసం ప్రత్యేక వెబ్ ​పోర్టల్​
  • 5 పైలెట్​ గ్రామాల్లో భూధార్​ కార్డులు రెడీ 
  • సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ధరణి ఫోరెన్సిక్​ ఆడిట్​ ప్రాథమిక రిపోర్ట్​ అందింది.. 
  • అక్రమాలు బయటపెడ్తంభూమార్పిడి పేరుతో 
  • దోచుకున్నది గత పాలకులేనని మండిపాటు

హైదరాబాద్​, వెలుగు: అన్ని ఆప్షన్లతో కూడిన భూ భారతి యాప్‌‌ను కొత్త ఏడాది జనవరిలో అందుబాటులోకి తెస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రకటించారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్  విభాగాలను ఒకే గొడుగు కిందికి తెస్తున్నామని.. ఇందుకోసం ప్రత్యేక వెబ్​ పోర్టల్ ​రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని భూములకు మూడు విడతల్లో భూధార్​ కార్డులు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు సంబంధించి ధరణి ఫోరెన్సిక్  ఆడిట్​ ప్రాథమిక నివేదిక అందిందని, దానిపై అధికారులతో స్టడీ చేయిస్తున్నామని తెలిపారు. అందులో తేలిని అక్రమాలను త్వరలోనే బయటపెడ్తామని ఆయన స్పష్టంచేశారు. బుధవారం సెక్రటేరియెట్​లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. భూ సర్వే కోసం పాత పద్ధతులను వినియోగించడం లేదని, డిజిటల్​ సర్వే చేసేందుకు ఇప్పటికే 400 రోవర్లు కొనుగోలు చేశామని చెప్పారు. నిషేధిత భూముల జాబితాను రూపొందించి వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టామని, ఎవరికైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫ్రీడం ఫైటర్స్​, ఎక్స్​ సర్వీస్​మెన్​ భూములకు సంబంధించి ఎన్​వోసీలు పెండింగ్​లో ఉన్నాయని.. సమస్యలు లేని వాటిని పరిష్కరిస్తామని ఆయన అన్నారు. 

పునాదుల నుంచి నిర్మిస్తున్నం

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిందని, కూలిన ఆ వ్యవస్థను పునాదుల నుంచి మళ్లీ నిర్మించుకుంటూ వస్తున్నామని, కొంచెం ఆలస్యమైనా రెవెన్యూ వ్యవస్థకు గట్టి పునాదులు వేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ శాఖలో గత రెండేండ్లలో తీసుకువచ్చిన సంస్కరణలను ఆయన వివరించారు. రెవెన్యూ, సర్వే విభాగం, స్టాంప్స్​ అండ్​ రిజిస్ర్టేషన్స్​ ఇవి వేర్వేరుగా ఉండటం వల్ల  మానిప్యులేషన్లు, అక్రమాలు జరుగుతున్నాయని.. అక్రమాలను అరికట్టేందుకు మూడు విభాగాలను సింగిల్​ ప్లాట్​ఫామ్​ కిందికి తెస్తున్నట్లు ప్రకటించారు. ‘‘గత ప్రభుత్వం ధరణిని విదేశీ సంస్థ అయిన టెర్రాసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కట్టబెట్టింది. కానీ మా ప్రభుత్వం వచ్చాక ఆ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీకి అప్పగించాం. అదే సమయంలో పాత యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో నడపలేక, పూర్తిగా కొత్త యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేశాం. ఇక ల్యాండ్ రికార్డ్స్, సర్వే, స్టాంప్ప్​ అండ్​ రిజిస్ట్రేషన్ వ్యవస్థలను ఏకీకృతం చేస్తూ ‘ఇంటిగ్రేటెడ్​’ విధానాన్ని తీసుకువస్తున్నాం. ఎక్కడ ఏ మార్పు జరిగినా దీనివల్ల అన్ని రికార్డుల్లో డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే అవుతాయి” అని వివరించారు. 

సాదాబైనామా దరఖాస్తులపై కోర్టు స్టే వెకేట్​

గత ప్రభుత్వంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులపై కోర్టు స్టే వెకేట్ చేయించామని మంత్రి పొంగులేటి చెప్పారు. అయితే.. ప్రభుత్వ, ఫారెస్ట్, వక్ఫ్, దేవాదాయ భూములను సాదాబైనామాల పేరుతో రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కేవలం అర్హత ఉన్న, న్యాయబద్ధమైన దరఖాస్తులనే పరిష్కరిస్తామన్నారు. కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఉన్న సాదాబైనామాలో అఫిడవిట్ తీసుకునే దానిపై అడ్వకేట్​ జనరల్​ ఓపినియన్​ తీసుకుంటున్నామని, త్వరలోనే ఈ సమస్యపై స్పష్టత వస్తుందని తెలిపారు. 

దాడులకు భయపడేది లేదు

తన కొడుకుపై వచ్చిన ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి స్పందించారు. ‘‘నాపై, నా కుటుంబ సభ్యులపై, నా కార్యాలయాలపై దాడులు చేసినా భయపడేది లేదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. పత్రికల్లో రాయడానికి వార్తలు లేక ఏదో ఒకటి సృష్టించి రాస్తున్నారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని ఆయన తెలిపారు.  

జీహెచ్ఎంసీలో 12 జోన్లుగా ఆఫీసులు 

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. స్లాట్ విధానం ద్వారా పారదర్శకత పెంచామని, జీహెచ్ఎంసీ పరిధిలోని 59 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను భౌగోళిక ప్రాతిపదికన 12 ప్రాంతాలకు కుదించి, కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాలు నిర్మిస్తున్నామన్నారు. గచ్చిబౌలిలో పైలట్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని, సీఎస్ఆర్ నిధులతో వీటిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. 

గత సర్కార్​లో ముడుపులకు భూమార్పిడి  

గత బీఆర్ఎస్ పాలనలో పారిశ్రామిక భూముల మార్పిడి పేరుతో జరిగిన అక్రమాలకు సంబంధించి సాక్ష్యాధారాలతో బయటపెడతామని పొంగులేటి తెలిపారు. ‘‘ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను బయటకు పంపాలన్నది గత ప్రభుత్వ నిర్ణయమే. అప్పట్లో కేస్ -బై -కేస్ పేరుతో.. నచ్చిన వారికి, ముడుపులిచ్చిన వారికి భూమార్పిడి చేశారు. మా ప్రభుత్వం పారదర్శకంగా, రోడ్డు వెడల్పును బట్టి నిర్దిష్ట ఫీజులు నిర్ణయించి ఓపెన్ పాలసీ తెచ్చింది. నిజాలు చెప్పడానికి మాకేం భయం లేదు. నా భూమి గురించి కూడా మాట్లాడుతున్నారు.. నాది ఒక్క గజం కూడా అక్రమంగా ఉందని తేలినా తీసుకోవచ్చు” అని ఆయన అన్నారు.  జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో  46 వేల అక్రిడిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.  

ట్రైబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్య పరిష్కారం

1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ట్రైబ్స్, నాన్​ ట్రైబ్స్ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కమిటీ వేయబోతున్నామని పొంగులేటి తెలిపారు. ‘‘రాజ్యాంగబద్ధంగా నాన్ ట్రైబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ (22ఏ) జాబితాను ప్రక్షాళన చేస్తున్నాం. ఈడీ, ఐటీ, కోర్టు కేసుల్లో ఉన్న భూములను మినహాయించి, అనవసరంగా జాబితాలో చేర్చిన వాటిని సరిచేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

మూడు విడతల్లో భూ సర్వే, భూధార్​ కార్డులు 

1940–48 నాటికి 40 లక్షలుగా ఉన్న సర్వే నంబర్లు, ప్రస్తుతం 2.40 కోట్లకు పైగా పెరిగాయని.. ఈ గందరగోళానికి ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాప్ పెడుతూ, కొత్త సర్వే నంబర్లు, బౌండరీలు ఫిక్స్ చేసి ‘భూధార్’ కార్డులను సిద్ధం చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతలుగా భూధార్​ కార్డును అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 413 రెవెన్యూ గ్రామాలకు నక్షాలు (మ్యాపులు) లేవని తెలిపారు. ఇందులో పైలట్ ప్రాజెక్టు కింద నలుదిక్కులా 5 గ్రామాలను ఎంపిక చేసి సర్వే పూర్తి చేశామన్నారు. వీటికి భూధార్​ కార్డులు కూడా సిద్ధమయ్యాయని చెప్పారు. స్థానిక ఎన్నికల తర్వాత ఈ గ్రామాల్లో సీఎం చేతుల మీదుగా భూధార్​ కార్డుల పంపిణీని ప్రారంభిస్తమన్నారు. మిగిలిన 408 గ్రామాల్లో అర్బన్​ పట్టణ ప్రాంతాలకు దగ్గర ఉన్నవాటిని తీసేస్తే 373 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, వీటికి రెండో విడతలో సర్వే చేసి బౌండరీలు ఫిక్స్​ చేస్తామని పేర్కొన్నారు. మూడో విడతలో ప్రతి జిల్లాలో పైలట్​ ప్రాజెక్ట్​ మాదిరి 70 గ్రామాల చొప్పున ఈ సర్వే చేపట్టి వివాదాలు లేని భూములన్నింటిని సర్వే చేసి భూధార్​ కార్డులు అందిస్తామని ఆయన వివరించారు. సర్వే అంటే టేపులు, చైన్లు, ఎర్ర జెండాలు అనే పాత పద్ధతికి స్వస్తి పలికామన్నారు. ‘‘దేశంలో ఎక్కడాలేని విధంగా తొలి విడతలో 400 'రోవర్స్' (అత్యాధునిక సర్వే యంత్రాలు) కొనుగోలు చేశాం. మరో 10 రోజుల్లో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే 3,490 మంది లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సర్వేయర్లను నియమించి.. మండలానికి నలుగురి నుంచి ఆరుగురుకు చొప్పున కేటాయించాం. డిసెంబర్ 20-25 నాటికి మరో 2,500 మందిని నియమిస్తాం’’ అని ఆయన తెలిపారు. భూధార్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్కసారి కోఆర్డినేట్స్ ఫిక్స్ అయితే, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నంత సులభంగా రైతులు తమ భూమి వివరాలు చూసుకోవచ్చని, వాటిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.

6.45 లక్షల దరఖాస్తులు పరిష్కరిస్తున్నం

ధరణి ద్వారా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టిన 2.45 లక్షల దరఖాస్తులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన మరో 4 లక్షల దరఖాస్తులు.. కలిపి మొత్తం 6.45 లక్షల దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ‘‘గతంలో మాదిరిగా కారణం లేకుండా తిరస్కరించ కుండా, రిజెక్ట్ చేసిన ప్రతి దరఖాస్తుకు ‘ప్రాపర్ స్పీకింగ్ ఆర్డర్స్’  ఇస్తున్నాం. గత ప్రభుత్వం ధరణిని ఒక విదేశీ సంస్థ (టెర్రాసిస్)కు అప్పగించింది. మేం వచ్చాక ఆ సీక్రెట్ లాకర్లను ఓపెన్ చేశాం. ఆ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాగు చేయాలంటే 9- నుంచి 10 నెలల టైమ్​ పడుతుంది. అందుకే ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏసీ ద్వారా కొత్త యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేయిస్తున్నాం. పారదర్శకమైన వ్యవస్థను ప్రజలకు అందిస్తాం’’ అని  అన్నారు.