ఐఐటీ గ్రాడ్యుయేట్లకు మేం H-1B వీసా స్పాన్సర్ చేస్తాం.. అమెరికా టెక్ కంపెనీ క్యాంపెయిన్

ఐఐటీ గ్రాడ్యుయేట్లకు మేం H-1B వీసా స్పాన్సర్ చేస్తాం.. అమెరికా టెక్ కంపెనీ క్యాంపెయిన్

విదేశాల్లో ఉద్యోగం మరీ ముఖ్యంగా అమెరికాలో స్థిరపడాలి అనుకునేది దశాబ్దాలుగా ఐఐటి గ్రాడ్యుయేట్స్ కల. అయితే ఇటీవల కాలంలో H-1B వర్క్ వీసా నిబంధనలు కఠినతరం కావడం, డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింత రిస్ట్రిక్టివ్ గా మార్చటం వంటి కారణాల వల్ల యూఎస్ డ్రీమ్స్ పై ఆందోళనలు పెరిగాయి. మరీ ముఖ్యంగా కొత్త H-1B దరఖాస్తుల ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు చేసిన ప్రకటన చాలా మంది ఆశావహులను నిరాశకు గురిచేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో యూఎస్ ఆధారిత AI రిక్రూట్‌మెంట్ సంస్థ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంస్థ IIT-ఢిల్లీ సహా ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల బయట భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో తాము ఐఐటీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకునేందుకు H-1B వీసా స్పాన్సర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అలాగే లక్ష డాలర్ల వీసా ఫీజులు తమను ఇండియా నుంచి బెస్ట్ టాలెంట్ రిక్రూట్ చేసుకోకుండా ఆపలేదంటూ రాయటం అందరినీ ఆకట్టుకుంటోంది.

ALSO READ : దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్స్‌లో నిలిచిపోయిన ఫ్లైట్స్..

ఈ పబ్లిక్ డిక్లరేషన్ చిన్న US కంపెనీలు అంతర్జాతీయ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసిన ప్రస్తుత పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉంది. అత్యంత నైపుణ్యం కలిగిన టెక్ నిపుణుల అవసరం ఉన్నందున, పెద్ద సంస్థలు పెరిగిన ఆర్థిక భారాన్ని మోయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని ఇది స్పష్టం చేస్తోంది. బెస్ట్ IIT గ్రాడ్యుయేట్‌లను దక్కించుకోవాలనే వారి నిర్ణయం ఈ ప్రచార వ్యూహం తెలియజేస్తోంది.

మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రధాన అంతర్జాతీయ సంస్థలు భారతదేశంలో భారీ టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో, దేశీయ టెక్.. స్టార్టప్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. ఇది భారతీయ యువ ఇంజనీర్లలో తమ సొంత దేశంలో విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకోవచ్చనే నమ్మకాన్ని అంతర్జాతీయ సంస్థలు కలిగిస్తున్నాయి. మరోపక్క ట్రంప్ వచ్చినప్పటి నుంచి అమెరికా యూనివర్సిటీల్లో భారత విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఈ మార్పు ఇప్పుడు భారతీయ యువత తమ దృష్టిని ఇక్కడ లభిస్తున్న అవకాశాలపైకి మళ్లిస్తున్నారనడానికి సూచికగా నిలుస్తోంది. అయితే ఈ ప్రకటన బెస్ట్ టాలెంట్ కోసం అమెరికన్ కంపెనీలు ఎంతవరకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయో నిరూపిస్తోంది.