మైక్రోసాఫ్ట్ అవుటేజ్ కారణంగా ఇవాళ(డిసెంబర్ 3న) దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయ కార్యకలాపాలు ఒక్కసారిగా అస్తవ్యస్తమయ్యాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో తలెత్తిన ఈ అంతర్జాతీయ సమస్య.. ఎయిర్‌పోర్ట్ ఐటీ వ్యవస్థలను క్రాష్ చేసింది. దీని ఫలితంగా చెక్-ఇన్, బోర్డింగ్ కోసం విమానయాన సంస్థలు ఉపయోగించే కీలక సాఫ్ట్‌వేర్స్ అంతరాయానికి గురయ్యాయి.
ఈ ఐటీ సమస్యతో ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థల కౌంటర్లు దేశంలోని అనేక ఎయిర్‌పోర్ట్స్‌లో నిలిచిపోయాయి. డిజిటల్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో.. సిబ్బంది తప్పనిసరిగా పాత పద్ధతిలో పెన్-పేపర్ ప్రక్రియలకు మారాల్సి వచ్చింది. దీంతో బోర్డింగ్ పాస్‌ల జారీ, లగేజీ ప్రాసెసింగ్ వంటి పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. రద్దీ విమానాశ్రయాల్లో అయితే ప్రయాణికులు గంటల తరబడి వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది ప్రయాణికులు తమ ఫ్లైట్స్ మిస్ అవుతామని ఆందోళన వ్యక్తం చేశారు.
ALSO READ : విమానంలో ప్రయాణీకుడి వింత చేష్ట
వారణాసి ఎయిర్‌పోర్ట్ ఈ సమస్యను బహిరంగంగా ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ అవుటేజ్ గురించి ప్రయాణీకులకు స్పష్టమైన నోటీసు ద్వారా వెల్లడించింది. ఇక ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సైతం దేశీయ విమానయాన సంస్థలకు ఆపరేషనల్ సవాళ్లు ఎదురవుతున్నాయని, ఆలస్యాలు ఉండవచ్చని ఎక్స్ పోస్టులో హెచ్చరించింది. పగటి పూట రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ అంతరాయం కలగడం విమానయాన సంస్థలకు మేనేజ్ చేయటం కష్టమైంది. ఆలస్యాలు ఉన్నప్పటికీ, సిబ్బంది మాన్యువల్‌గా పనిచేస్తూ విమానాలను నడుపుతున్నట్లు సంస్థలు చెబుతున్నాయి. అయితే మధ్యాహ్నం నాటికి కొన్ని చోట్ల వ్యవస్థలు పునఃప్రారంభం కావడంతో కార్యకలాపాలు మెరుగుపడ్డాయి. దీంతో ఆధునిక విమానాశ్రయాలు డిజిటల్ వ్యవస్థలపై ఎంతగా ఆధారపడి ఉన్నాయో మరోసారి స్పష్టం చేసింది.
