ప్రకటించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్
దండేపల్లి, వెలుగు : బీజేపీ బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి తాను వ్యక్తిగతంగా రూ. 10 లక్షలు అందజేస్తానని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ ప్రకటించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం, లింగాపూర్ గ్రామాల్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లలో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
గ్రామాలకు నిధులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, అక్కడి నుంచి వచ్చే నిధుల కోసమే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది తప్ప.. అభివృద్ధి కోసం కాదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. తీరా ఎలక్షన్లు వచ్చాక వారిని మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపతి రాజన్న, నందుర్క సుగుణ, గుండా ప్రభాకర్, శ్రీనివాస్, ముత్తె అనిల్, దార శేఖర్, ఎర్రం విజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
