హైదరాబాద్ ఓల్డ్ సిటీలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటో చేసుకుంది. . ఓల్డ్ సిటీలోని చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో రెండు డెడ్ బాడీలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం (డిసెంబర్ 03) తెల్లవారుజామున రోమన్ హోటల్ ఎదురుగా ఉన్న ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మాదకద్రవ్యాలు అధిక మోతాదులో సేవించడమే మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు సోమవారం రాత్రి స్టెరాయిడ్స్ తీసుకోగా.. ఇద్దరు డోస్ ఎక్కువై చనిపోయి ఉంటారని.. మరొకరు పరారీలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
చనిపోయిన వ్యక్తులను జహాంగీర్ (24) , ఇర్ఫాన్ (25) లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుండగా మూడు ఇంజెక్షన్ లు సిరంజీలు ఘటనా స్థలంలో లభ్యం అయ్యాయి. దీంతో ఈ ఘటనలో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకరు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ చెక్ చేస్తున్నారు పోలీసులు.
