- కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడి..
- పోటీ చేసే ఆశావహులకు మంత్రి దిశానిర్దేశం..మంత్రి వివేక్
కోల్‌బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలువబోతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి బి1 ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డితో కలిసి మీడియాతో మంత్రి మాట్లాడారు.
రాజకీయాల్లో ప్రవేశానికి గ్రామ స్థాయి ఎన్నికలు పునాది అని అన్నారు. ఎవరైతే గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకమై ఉంటారో, వారినే ఆదరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ మద్దతుతో నిలబడేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారని, టికెట్ కోసం పార్టీ ఆశావహుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీడర్ షిప్ ఫెయిల్యూర్ అని ఈ ఎన్నికల ద్వారా మరోసారి రుజువు కానుందన్నారు.
లీడర్లు సమన్వయంతో సాగండి..
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ హయంలో ఒక రేషన్‌కార్డు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకే సర్పంచ్‌లుగా పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువ శాతం ఏకగ్రీవం చేసుకుంటున్నారని వెల్లడించారు. పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు లీడర్లు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వచ్చే మూడున్నర ఏండ్లలో గ్రామాలను మరింత అభివృద్ది చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజలకిచ్చిన మాట ప్రకారం చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో రూ.200 కోట్లతో పలు అభివృద్ది పనులు చేపట్టామని తెలిపారు. మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ రెండో ఫేజ్ విస్తరణ పనులకు పబ్లిక్ హియరింగ్ చేపట్టడం శుభపరిణామన్నారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనుల తవ్వకాలతోనే ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి స్పష్టం చేశారు.
