పాలమూరు జిల్లాలో భూభారతి రెవెన్యూ సదస్సులు షురూ

పాలమూరు జిల్లాలో భూభారతి రెవెన్యూ సదస్సులు షురూ

అడ్డాకుల, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం నుంచి భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. పైలెట్​ ప్రాజెక్టుగా ఎంపికైన మండలాల్లోని గ్రామాలకు అధికారులు వెళ్లి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. మహబూబ్​నగర్  జిల్లా మూసాపేట మండలం పైలెట్  ప్రాజెక్టుగా ఎంపిక కాగా, చక్రాపూర్, తుంకినీపూర్  గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. చక్రపూర్ లో నిర్వహించిన సదస్సుకు కలెక్టర్  విజయేందిర బోయి హాజరై మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామని, ప్రతిరోజు మండలంలోని రెండు గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

కొల్లాపూర్: నాగర్ కర్నూల్  జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం, సింగవరం గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్  బదావత్​ సంతోష్​ పాల్గొన్నారు. భూసమస్యలపై దరఖాస్తులను స్వీకరించి  రశీదులు అందించారు. భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్​ సూచించారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్  వద్ద సౌలతులు, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. స్పెషల్  డిప్యూటీ కలెక్టర్  అరుణ రెడ్డి, ఆర్డీవో బన్సీలాల్. తహసీల్దార్లు విజయ్ సింహ, విజయ్ కుమార్  పాల్గొన్నారు.

గోపాల్ పేట: భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని వనపర్తి కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. గోపాల్ పేట మండలం చెన్నూరు, జయన్న తిర్మలాపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. జయన్న తిర్మలాపూర్  గ్రామాన్ని కలెక్టర్  సందర్శించి రెవెన్యూ సదస్సును పరిశీలించారు. 

రాష్ట్ర ప్లానింగ్  బోర్డు వైస్  చైర్మన్  జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్  ప్రభుత్వం ధరణి తీసుకువచ్చి, గతంలో కాంగ్రెస్  ప్రభుత్వం ఇచ్చిన భూములను తిరిగి లాక్కుందని తెలిపారు. భూభారతి చట్టంతో రూపాయి ఖర్చు లేకుండా సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్  పాండు నాయక్, డీటీ తిలక్ రెడ్డి ఉన్నారు.

చిన్న గ్రామంలో ఎక్కువ సమస్యలు..

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని చిన్న గ్రామమైన గోపాలదిన్నెలో భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డిజిటల్  సిగ్నేచర్  కాలేదని, సర్వే నంబర్లలో ఎక్సెస్  ఉన్నాయని, లెస్  ఉన్నాయని, విరాసత్  కావడం లేదని, నిషేధిత జాబితాలో తమ భూములు ఉంచారని, ఈ సమస్యలు పరిష్కరించాలని గ్రామ రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 30 మంది రైతులు ఆఫీసర్ల దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు. చాలా ఏండ్ల నుంచి ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

సదస్సుకు హాజరైన కలెక్టర్  సంతోష్  రైతుల సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అడిషనల్  కలెక్టర్  లక్ష్మీనారాయణ, తహసీల్దార్లు వీరభద్రప్ప, నరేశ్, ఎంపీడీవో మోయినుద్దీన్​ పాల్గొన్నారు.