
- రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు
- భూభారతిని దశలవారీగా అమలు చేస్తం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 28 జిల్లాల్లోని 28 మండలాల్లో సోమవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. భూ భారతి చట్టంలో భాగంగా భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించనున్నారు. గత నెలలో 4 జిల్లాల్లోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భూభారతి చట్టాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ప్రజాకోణంలో రూపొందించిన విప్లవాత్మక చట్టం భూభారతి అని, ఈ చట్టం ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ ఈ సదస్సుల్లో పాల్గొని, రైతులు, ప్రజల సందేహాలను తీర్చి, సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులకు మంత్రి సూచించారు. గతంలో భూ సమస్యలకు కోర్టులే ఏకైక మార్గంగా ఉండగా, ఇప్పుడు అధికార యంత్రాంగం రైతుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు.
చట్టాన్ని విజయవంతంగా అమలు చేయడంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారం కీలకమని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ను గత ప్రభుత్వం దురుద్దేశంతో రూపొందించి, రైతుల జీవితాలను ఆగమాగం చేసిందని విమర్శించారు. పదేండ్లలో భూ హక్కుల విధ్వంసం జరిగిందని ఆరోపించారు.
28 మండలాలు ఇవే..
ఆదిలాబాద్‌లో భరోజ్, భద్రాద్రి కొత్తగూడెంలో సుజాతనగర్, హనుమకొండలో నడికుడ, జగిత్యాల జిల్లా బుగ్గారం, జనగాంలో ఘన్‌పూర్, జయశంకర్ భూపాలపల్లిలో రేగొండ, జోగులాంబ గద్వాల్‌లో ఇటిక్యాల్, కరీంనగర్ జిల్లాలో సైదాపూర్, కొమ్రంభీం ఆసిఫాబాద్‌లో పెంచికల్‌పేట్, మహబూబాబాద్‌లో దంతాలపల్లె, మహబూబ్ నగర్‌లో మూసాపేట్, మంచిర్యాలలో భీమారం, మెదక్‌లో చిల్పిచిడ్, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో కీసర, నాగర్‌కర్నూల్‌లో పెంట్లవల్లి, నల్గొండలో నక్రేకల్, నిర్మల్‌లో కుంతాల, నిజామాబాద్‌లో మెండోరా, పెద్దపల్లిలో ఎలిగేడ్, రాజన్న సిరిసిల్లలో రుద్రంగి, రంగారెడ్డిలో కుందుర్గ్, సంగారెడ్డిలో కొండాపూర్, సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట, సూర్యాపేటలో గరిడేపల్లె, వికారాబాద్‌లో ధరూర్, వనపర్తిలో గోపాలపేట, వరంగల్‌లో వర్దన్నపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూర్ మండలాల్లో సోమవారం నుంచి సదస్సులు నిర్వహించనున్నారు.