ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్నపై సస్పెన్షన్ వేటు

ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్నపై సస్పెన్షన్ వేటు
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చర్యలు 
  • గతంలో లీడర్లపై భుజంగరావు నిఘా
  • ప్రణీత్ రావుతో కలిసి బ్లాక్ మెయిల్ దందా
  • ఇంటెలిజెన్స్​ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో తిరుపతన్నకు లింక్స్
  • అదుపులో మరో ఇద్దరు టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్లు! 

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాళ్లిద్దరినీ శనివారం సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి హోంశాఖ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్‌‌ బ్రాంచ్‌‌ (ఎస్‌‌ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్‌‌రావును ఇప్పటికే ఉన్నతాధికారులు సస్పెండ్‌‌ చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా అరెస్ట్‌‌ అయి, 24 గంటలకు పైగా జైలులో ఉంటే రూల్స్ ప్రకారం వారిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే టాస్క్‌‌ఫోర్స్‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌రావు రిటైర్డ్‌‌ పోలీస్ ఆఫీసర్ కావడంతో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రణీత్‌‌రావు, రాధాకిషన్ రావు చంచల్‌‌గూడ జైలులో ఉండగా.. భుజంగరావు, తిరుపతన్న పోలీస్ కస్టడీలో ఉన్నారు.  

రెండోరోజు విచారణ.. 

భుజంగరావు గతంలో ఇంటెలిజెన్స్‌‌ లో పొలిటికల్‌‌ వింగ్‌‌ అడిషనల్ ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. తిరుపతన్న గతంలో ఎస్‌‌ఐబీ అడిషనల్‌‌ ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం సిటీ సెక్యూరిటీ వింగ్‌‌ అడిషనల్‌‌ డీసీపీగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్లిద్దరి పాత్ర ఉందని ఆధారాలు దొరకడంతో స్పెషల్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఐదు రోజుల కస్టడీకి అప్పగించగా, బంజారాహిల్స్‌‌లోని స్టేషన్ లో ఇద్దరిని విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా శనివారం రెండో రోజు కీలక వివరాలు రాబట్టారు. ప్రధానంగా భుజంగరావు ఇంటెలిజెన్స్‌‌ పొలిటికల్‌‌ వింగ్‌‌లో పని చేసినప్పుడు చేపట్టిన ఆపరేషన్స్‌‌ పై ఆరా తీసినట్టు తెలిసింది. 

స్పెషల్ టీమ్ అదుపులో టాస్క్ ఫోర్స్ సీఐలు?  

టాస్క్‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌ రావును అరెస్టు చేసిన స్పెషల్ టీమ్ పోలీసులు.. ఆయనతో కలిసి పని చేసిన ఐదుగురు ఇన్‌‌స్పెక్టర్లను కూడా విచారిస్తున్నారు. వీళ్లలో ఇద్దరు ఇన్‌‌స్పెక్టర్లు అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారని సమాచారం. ఆ ఇన్ స్పెక్టర్లను శనివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రాధాకిషన్ రావు చేపట్టిన ఆపరేషన్స్ పై ఆరా తీస్తున్నారు. వీళ్లను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారని సమాచారం.

బ్లాక్ మెయిలింగ్ దందాలో భుజంగరావు..

ఇంటెలిజెన్స్‌‌ పొలిటికల్‌‌ వింగ్‌‌లో పని చేసిన భుజంగరావు.. వివిధ పార్టీలకు చెందిన లీడర్ల సమాచారం ప్రణీత్‌‌రావుకు అందించడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. భుజంగరావు ఇచ్చిన నంబర్ల ద్వారా, పొలిటికల్ లీడర్ల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసేవారని.. ఆ ఆడియోలను మళ్లీ భుజంగరావుకు పంపేవారని విచారణలో తేలినట్టు సమాచారం. ఆ ఆడియో రికార్డుల ఆధారంగా ప్రైవేట్ వ్యక్తులతో కలిసి భుజంగరావు అక్రమాలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రణీత్‌‌రావు వద్ద సేకరించిన సమాచారం ఆధారంగా భుజంగరావును ప్రశ్నిస్తున్నారు. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ ద్వారా బ్లాక్‌‌మెయిల్‌‌కు గురైన ఫార్మా, రియల్‌‌ ఎస్టేట్‌‌, ఐటీ కంపెనీలకు చెందిన ప్రముఖల వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌‌ పరిధిలో ప్రణీత్‌‌రావుతో కలిసి భుజంగరావు చేసిన అక్రమ లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. 

సీక్రెట్ డేటాపై ఆరా.. 

ఎస్‌‌ఐబీలో అడిషనల్‌‌ ఎస్పీగా పని చేసిన తిరుపతన్న.. అంతకుముందు చాలాకాలం నల్గొండ జిల్లాలో విధులు నిర్వహించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్‌‌ ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్న టైమ్ లో వివిధ పోలీస్‌‌ స్టేషన్లలో పని చేశారు. నయీం గ్యాంగ్‌‌ కదలికలను గుర్తించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో ప్రభాకర్‌‌ రావు‌‌ ఎస్‌‌ఐబీ చీఫ్‌‌ అయిన తర్వాత తిరుపతన్న కూడా అందులో అడిషనల్ ఎస్పీగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌‌‌‌రావుతో ఉన్న లింకులపై తిరుపతన్నను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్‌‌ రావు చేసిన ఆపరేషన్స్‌‌ పై ఆరా తీస్తున్నారు. లాగర్‌‌‌‌ రూమ్‌‌లోని సీక్రెట్ డేటాలో ఏముండేది? దాన్ని ఎందుకు ధ్వంసం చేశారు? అనే వివరాలు రాబడుతున్నట్టు తెలిసింది.