- కరీంనగర్ జిల్లా వీణవంకలో విషాదం
వీణవంక, వెలుగు : అనారోగ్యంతో భర్త చనిపోవడాన్ని తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య (70), పద్మ (65) దంపతులు. శంకరయ్య కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితం అయ్యారు. అనారోగ్యం కారణంగా సోమవారం శంకరయ్య చనిపోయాడు. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన పద్మ ఇంట్లో ఉన్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించిన స్థానికులు అక్కడికి వచ్చి చూసే సరికే పద్మ చనిపోయింది. భార్యాభర్తలు ఒకేసారి చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
