న్యూఢిల్లీ: ఇండియాలో 20–29 ఏళ్ల యువతలో కేవలం 47 శాతం మందికి మాత్రమే పెయిడ్ ఎంప్లాయ్‌మెంట్ (వేతనం పొందే పని) ఉంది. ఇందులో 79 శాతం మంది మగవారు ఉండగా, మహిళలు వాటా 18.2 శాతమే. యువత ఉద్యోగ పరిస్థితులపై గ్రేట్ లేక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ తాజాగా ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, బీహార్, ఉత్తరప్రదేశ్‌లో ప్రతి పది మంది యువతుల్లో ఒకరికి కూడా ఉద్యోగం లేదు. యువతలో ఎక్కువ మంది ఇన్‌ఫార్మల్ ఎంటర్‌ప్రైజ్‌లలో పనిచేస్తున్నారు.
కేవలం 9.5శాతం మాత్రమే ఫార్మల్ ఎంటర్‌ప్రైజ్‌లలో ఉండగా, 37.2శాతం మంది ఇన్‌ఫార్మల్ ఎంటర్‌ప్రైజ్‌లలో ఉన్నారు. అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకొని, నియమ, నిబంధనలు పాటించే సంస్థలను ఫార్మల్ ఎంటర్‌ప్రైజ్‌లని అంటారు. ఇవి సాధారణంగా ప్రభుత్వ, కార్పొరేట్ లేదా పెద్ద స్థాయి సంస్థలు అవుతాయి. ఇన్‌ఫార్మల్ ఎంటర్‌ప్రైజ్ అంటే కుటుంబ ఆధారిత వ్యాపారాలు, వ్యవసాయం, నిర్మాణ పనులు, చిన్న సర్వీసెస్ కంపెనీలు. ఇవి ఎక్కువగా రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తాయి.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇన్‌ఫార్మల్ ఎంటర్‌ప్రైజ్‌లలో పనిచేసే వారు 85శాతం వరకు ఉన్నారు. పట్టణాల్లో పని గంటలు ఎక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి. యువత సగటున రోజుకు ఏడు గంటల షిఫ్ట్‌కు వేతనం ఇచ్చే జాబ్స్‌లో పని చేస్తున్నారు. ఇన్‌ఫార్మల్ సెక్టార్‌లో మహిళల పని గంటలు తగ్గుతుండగా, మగవారి పని గంటల్లో పెద్ద మార్పు లేదు. మహిళలు వేతన పనితో పాటు ఇంటి పనులు కూడా చేస్తున్నారు.
