ఐటీ దాడులపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

ఐటీ దాడులపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి స్పందించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై ఐటీ దాడులు జరిగాయన్న ఎమ్మెల్యే, ఈ సోదాల్లో అధికారులకు తన నివాసంలో ఏమీ దొరకలేదని వెల్లడించారు. 

"నాపై వచ్చిన ఆరోపణలు నిజం కాదు. నాకు ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవు. ఈ సోదాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్‌కు సంబందించిన డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు. నేను 1998 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా. నేను హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే.. నా సతీమణి బెంగుళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. క్రమం తప్పకుండా ఆదాయపు పన్ను తాము చెల్లిస్తున్నాం. అయినప్పటికీ.. నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు". 

"గురువారం విచారణకు రావాల్సిందిగా అధికారులకు నాకు నోటీసులు ఇచ్చారు. విచారణకు వెళ్లి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తా. నేను నిజాయితీ పరుడిని. నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నాకోసం మూడు రోజులుగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు అందరికి ధన్యవాదాలు.." అని పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు.

కాగా, పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో మూడు రోజుల పాటు సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు చెందిన కంపెనీలు, వ్యాపార వ్యవహారాలు, వారు చెల్లిస్తోన్న పన్నులుకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.