
- భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కామెంట్
హైదరాబాద్, వెలుగు: సీబీఐ విచారణ ప్రారంభం కాకముందే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం సీఎల్పీలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో హరీశ్ రావు, సంతోష్ లు అవినీతికి పాల్పడ్డారని కవిత మొదటి సాక్ష్యం ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపింaచారు.
నిజాం కట్టిన పోచారం ప్రాజెక్టుపై నుంచి వరద నిటారుగా పోయినా...ఆ ప్రాజెక్టు చెక్కు చెదరలేదని, కానీ, కాళేశ్వరం కట్టి ఐదేండ్లు కాకుండానే కూలిపోవడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడకుంటే కేసీఆర్, హరీశ్ లు కోర్టుల వెంట ఎందుకు పరుగెడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ తప్పు చేయకపోతే విచారణ సంస్థలకు ఎందుకు భయపడుతున్నారని అడిగారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకుండా మొహం చాటేయడంతోనే ఆయన అవినీతికి పాల్పడినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు.