V6 News

చేనేతను ఆదుకోవాలి : ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి

చేనేతను ఆదుకోవాలి : ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు: చేనేత రంగాన్ని ఆదుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి కోరారు. ఢిల్లీలో జరిగిన టెక్స్​టైల్స్​ మంత్రిత్వ  శాఖ మీటింగ్​లో చేనేత రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కార్మికుల సమస్యలను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్​కు వివరించారు. చేనేత రంగం ఆర్ధిక వ్యవస్థలో కీలకంగా ఉంటుందని తెలిపారు. పోచంపల్లి ఇక్కత్​ వస్త్రాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాయని చెప్పారు. ఎగుమతి కూడా చేస్తున్నారన్నారు. ఇక్కత్​ వస్త్రాలకు నకిలీ దెబ్బతీస్తోందని తెలిపారు.  

ఒక్కో చీర రూ. 10 వేలకు నేత కార్మికుడు డిజైన్​ చేస్తే..  అదే డిజైన్​తో రూ. 600 తోనే  చీరలు మార్కెట్‌లోకి వస్తున్నాయని చెప్పారు. దీంతో అసలు వస్త్రాల మార్కెటింగ్​లో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, చేనేత రంగంపై ఆధారపడిన వారందరూ ఆర్ధికంగా దెబ్బతింటున్నారని చెప్పారు.  చేనేతపై సాంకేతికత ప్రభావం చూపుతోందన్నారు. ఈ రంగాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.  రూ. 100 కోట్లతో ప్రత్యేకంగా  కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. అసలైన పోచంపల్లి చీరలకు అథెంటికేషన్ ట్యాగ్​జత చేయాలన్నారు.  బ్రాండ్​అంబాసిడర్​తో చేనేత వస్త్రాలకు ప్రచారం నిర్వహించాలన్నారు. అదే విధంగా నకిలీ తయారీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.