
ప్యోంగ్ టేక్(సౌత్ కొరియా): అంతర్జాతీయ అంశాలు, టెక్నాలజీ ఇష్యూలే ఎజెండాగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆసియా టూర్ ప్రారంభించారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను ఇబ్బందులకు గురిచేస్తున్న కంప్యూటర్ చిప్ షార్టేజ్ అంశంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. శుక్రవారం సౌత్ కొరియా చేరుకున్న బైడెన్ అక్కడ శాంసంగ్‌కు చెందిన కంప్యూటర్ చిప్ తయారీ యూనిట్‌ను సందర్శించారు. ఇదే తరహాలో 17 బిలియన్ అమెరికన్ డాలర్లతో శాంసంగ్ అమెరికాలోని టెక్సాస్‌లో చిప్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. అమెరికాలో పెట్టే చిప్ ప్లాంట్ ద్వారా 3 వేల ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఫ్యాక్టరీ నిర్మాణంలో వేలాది మంది కార్మికులకు పని దొరుకుతుందనే అమెరికన్ల అభిప్రాయం. గత ఏడాది సెమీ కండక్టర్ల షార్టేజీ కారణంగా అంతర్జాతీయంగా ఆటో ఇండస్ట్రీ, కిచెన్ అప్లయన్సెస్, ఇతర కంపెనీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి.. కొంత కాలంగా అమెరికా ఓటర్లలో బైడెన్ పబ్లిక్ అప్రూవల్ రేటు తగ్గిపోతూ వచ్చింది. సౌత్ కొరియా, జపాన్‌లో బైడెన్ ఐదు రోజుల టూర్లో భాగంగా విదేశాంగ విధానానికి సంబంధించి అనేక పాలసీలపై చర్చలు జరపనున్నారు. సౌత్ కొరియా కొత్త అధ్యక్షుడు యాన్ సుక్ యోల్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ చైర్మన్ లీ జియాంగ్‌తో బైడెన్ సమావేశమయ్యారు.