అమెరికాలో గన్ కంట్రోల్.. బిల్లుపై బైడెన్ సంతకం

అమెరికాలో గన్ కంట్రోల్.. బిల్లుపై బైడెన్ సంతకం

అమెరికాలో గన్ కల్చర్ వల్ల జరుగుతున్న దారుణాలు అన్నీఇన్నీ కావు. సాయుధ దుండగులు జరిపే కాల్పుల్లో ఏటా ఎంతోమంది చనిపోతున్నారు. ఈ ఏడాది కూడా అటువంటి పలు ఘటనలు చోటుచేసుకున్నాయి.  ఈ దారుణాలను కొనసాగనివ్వబోమని అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని నెలల క్రితమే చెప్పారు. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. దేశంలో తుపాకుల లభ్యతను కఠినతరం చేసే బిల్లును అమెరికా కాంగ్రెస్ దిగువ సభ (హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్) శనివారం ఉదయం ఆమోదించింది. దీనికి అనుకూలంగా 234 , వ్యతిరేకంగా 193 ఓట్లు పడ్డాయి.  ఆ వెంటనే బిల్లుపై  అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా సంతకం చేశారు.

అమెరికా ఎగువ సభలోనూ..

అయితే అంతకుముందు రోజు(శుక్రవారం) అమెరికా కాంగ్రెస్ ఎగువ సభ ( సెనేట్ ) లోనూ ఈ బిల్లు పాసైంది. దీనికి అనుకూలంగా 65, వ్యతిరేకంగా 33 ఓట్లు పడ్డాయి. మరో వారం, పదిరోజుల్లో డెమొక్రాట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదాన్ని పొందగలిగితే చట్టంగా మారుతుంది.  కాగా, రెండు రోజుల క్రితం (గురువారం మధ్యాహ్నం) అమెరికా సుప్రీంకోర్టు ఈ బిల్లుకు పూర్తి విరుద్ధమైన తీర్పును ఇచ్చింది. న్యూయార్క్ రాష్ట్రం 109 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు చెల్లదంటూ అమెరికా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. బహిరంగ ప్రదేశాల్లో మారణాయుధాలు ధరించి తిరగడం అమెరికా పౌరుల హక్కని తేల్చి చెప్పింది. 

బిల్లులో ఏముందంటే.. 

ఇకపై 21 ఏళ్లలోపు వారు తుపాకులు కొంటే వారి నేపథ్యంపై పూర్తి వివరాలను సేకరిస్తారు. పాఠశాలల్లో భద్రతను పెంచడానికి, ప్రజల మానసిక సమస్యల నివారణకు భారీగా నిధులు కేటాయిస్తారు. ఎవరి చేతుల్లోనైనా తుపాకులు ఉండటం ప్రమాదకరమని భావిస్తే.. వాటిని స్వాధీనం చేసుకొని లైసెన్సును రద్దు చేసే అధికారాలు రాష్ట్రాలకు దక్కుతాయి.