ముత్యాలమ్మ జాతరకు వేళాయే!

 ముత్యాలమ్మ జాతరకు వేళాయే!
  • దుమ్ముగూడెంలో రెండేండ్లకోసారి అమ్మవారి ఉత్సవాలు
  • ముస్తాబైన ఆలయం.. నేటి నుంచి 9 రోజులపాటు వేడుకలు 
  • తెలంగాణతోపాటు ఏపీ, ఛత్తీస్​గఢ్, మహారాష్ట్రల నుంచి తరలిరానున్న ఆదివాసీలు
  • లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం.. అన్నిఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ 

భద్రాచలం, వెలుగు : రెండేండ్లకోసారి ఘనంగా జరిగే భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల కేంద్రంలోని ముత్యాలమ్మ జాతరకు వేళాయింది.  నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణతోపాటు ఆంధ్రా, ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్రల నుంచి ఆదివాసీలు భారీ సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1978 నుంచి ఈ ఉత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. తొమ్మి రోజుల్లో ఐదు లక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. 

ఆ మూడు రోజులు ప్రత్యేకం..

జాతర మొదలైన తర్వాత మూడు రోజులు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. తొలిరోజు పుట్టమన్ను తెచ్చి ఉత్సవాలు ఆరంభించి పొలిమేరల్లో తోరణాలు కడతారు. మూడు, ఆరు, తొమ్మిదవ రోజుల్లో గరిగెలతో గ్రామంలో నిర్వహించే ఊరేగింపు హైలట్​గా నిలుస్తాయి. మగవారు ఆడవేషధారణలో అమ్మవారి గరిగెలను శిరస్సుపై ధరించి ఇంటింటికీ వెళ్లి నైవేద్యాలు స్వీకరిస్తారు. ఊరేగింపునకు ముందు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సమయంలో అమ్మవారి నామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగుతాయి. ఇక 9వ రోజు ఊరేగింపులో కొమ్మునృత్యాలు, భేతాళ సెట్స్, కింగ్​కాంగ్​వేషధారణలు, రాకాసి బొమ్మలు, డప్పు వాయిద్యాలతో జరిగే ఊరేగింపులో మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు ఆకట్టుకుంటాయి. 

అందరికీ అన్నదానం

జాతరకు వచ్చే భక్తులందరికీ 9 రోజులూ అన్నదానం చేస్తారు. ఎటువంటి పరిమితులు లేకుండా వచ్చిన వారికి తృప్తిగా భోజనం వడ్డిస్తారు. 1978 నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం వేళ కల్చరల్ ప్రోగ్రామ్స్​ ఆకట్టుకుంటాయి. డ్యాన్స్ బేబీ డ్యాన్స్, మ్యూజికల్ నైట్స్, మాయాబజార్ లాంటి నాటకాలు, సినీ డూప్స్ తో ప్రోగ్రామ్​తో ఫుల్​ఎంటర్​టైన్​మెంట్స్ ఉంటాయి. 

ఏర్పాట్లు పూర్తిచేశాం

నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ప్రధానంగా మన్యంలోని ప్రజలు ఆరాధ్యదైవం భావిస్తారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశాం. తొమ్మిది రోజులు అన్నదానం చేస్తాం. ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకునేందుకు అంతా సిద్ధం చేశాం. చుక్కా గణేశ్​రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్​