బిగ్ బాస్ నటి కారు బోల్తా.. ఒకరి మృతి

బిగ్ బాస్ నటి కారు బోల్తా.. ఒకరి మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో బిగ్ బాస్ ఫేమ్ యాషికా ఆనంద్ తీవ్రంగా గాయపడింది. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలుకాగా.. యాషికా స్నేహితురాలు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వల్లిశెట్టి భవాని మృతి చెందింది. మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన యాషికా ఆనంద్‌తో పాటు.. మరో ఇద్దరిని చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ఫ్యాషన్ మోడల్‌గా, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ బ్యూటీ.. దురువంగల్ పత్తినారుతో 2016లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్‌గా మారింది. అంతేకాకుండా కమల్ హాసన్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ 2 తమిళ్ సిరీస్‌లో పాల్గొని తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బిగ్ బాస్ హౌస్‌లో 98 రోజుల పాటు ఉండి.. 5వ స్థానాన్ని దక్కించుకుంది.