బుల్లితెర రియాలిటీ షోలలో కింగ్‌లా వెలుగొందుతోంది 'బిగ్ బాస్'. తెలుగులో ఈ షోను కింగ్ నాగార్జున హోస్ట్‌గా విజయవంతంగా నడుస్తున్నారు. కానీ కొన్ని ఇతర భాషల్లో మాత్రం హౌస్ లో కంటెస్టెంట్లు హద్దులు తప్పుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళ 'బిగ్ బాస్ సీజన్ 9' లో ఇటీవల జరుగుతున్న ఘటనలు ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్నాయి. తెలుగులో కేవలం మాటల గొడవలు, చిన్న చిన్న దెబ్బలతో టాస్క్‌లు ముగుస్తుంటే... తమిళంలో మాత్రం ఇవి ఫిజికల్ డ్యామేజ్ వరకూ వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
హద్దులు దాటిన ఫిజికల్ టాస్క్..
లేటెస్ట్ గా తమిళ బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. టాప్ కంటెస్టెంట్‌గా.. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్న వీజే పార్వతి (VJ Parvathi), కెప్టెన్సీ కోసం జరిగిన 'BB బాటిల్ హంట్' అనే ఫిజికల్ టాస్క్‌లో తీవ్రంగా గాయపడింది. ఈ టాస్క్‌లో శబరినాథ్ (Sabarinath) అనే కంటెస్టెంట్‌తో పోటీ పడింది. ఈ సమయంలో శబరినాథ్ దూకుడుగా ముందుకు దూకడంతో అతని మోకాలు అనుకోకుండా పార్వతి కంటిపై బలంగా తగిలింది. ఆ దెబ్బకు పార్వతి క్షణాల్లో నేలపై పడిపోయి తీవ్ర నొప్పితో ఏడవడం మొదలుపెట్టింది.
ఉద్దేశపూర్వక దాడి ఆరోపణలు..
ఈ గాయం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్వతి కన్ను మొత్తం వాచిపోయి, నల్లబడటం చూసి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ నిర్వాహకులు వెంటనే ఆమెను మెడికల్ రూమ్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే, ఈ ఘటన యాక్సిడెంట్ కంటే, ఉద్దేశపూర్వక దాడిగా ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. టాస్క్ అనంతరం శబరినాథ్ తన తోటి హౌస్‌మేట్స్‌తో కావాలనే నేను చేశాను అని చెప్పినట్లుగా కొన్ని వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసి హౌస్‌మేట్స్‌తో పాటు బయట ప్రేక్షకులు కూడా ఉలిక్కిపడ్డారు. శబరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బిగ్ బాస్ నియమాలను అతిక్రమించినందుకు అతన్ని హౌస్ నుంచి పంపించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
పార్వతి ధైర్యానికి ప్రశంసలు..
కంటెస్టెంట్ పార్వతి తన కంటికి అంత పెద్ద గాయమై, వాచిపోయినప్పటికీ, చికిత్స అనంతరం మళ్లీ టాస్క్ కొనసాగించడానికి సిద్ధపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఆట పట్ల చూపించిన ఈ అంకితభావం, ధైర్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు, ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నటుడు విజయ్ సేతుపతి, ఈ వారాంతపు ఎపిసోడ్‌లో ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో, శబరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
తెలుగులోనూ పెరుగుతున్న ఉత్కంఠ
ఇక తెలుగు బిగ్ బాస్ 9 విషయానికి వస్తే, కింగ్ నాగార్జున హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఈ సీజన్ మంచి టీఆర్‌పీ రేటింగ్‌లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్ లాంటి కంటెస్టెంట్స్ కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. కానీ, తమిళంలో మాదిరిగా తెలుగు బిగ్ బాస్ సెట్‌లో ఫిజికల్ డ్యామేజ్ అయ్యే ప్రమాదాలు రాకుండా నిర్వాహకులు మరింత జాగ్రత్త తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
