పొలిటికల్ రుబాబు చూపించడానికే తనపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి దాడి చేశాడని బిగ్ బాస్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆరోపించారు. బుధవారం రాత్రి ప్రిజమ్ పబ్‌లో జరిగిన దాడిపై ఆయన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి ప్రిజమ్ పబ్‌కి వెళ్లిన తనపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, అతడి ఫ్రెండ్స్ కలిసి బీరు బాటిళ్లతో దాడి చేశారని చెప్పారు. తన స్నేహితురాలిపై వాళ్లు కామెంట్స్ చేశారని, దీనిపై ప్రశ్నించిన తనపై గొడవకు దిగారని అన్నారు రాహుల్. ఆ తర్వాత కొద్దిసేపటికి వచ్చి బీర్ బాటిల్స్‌తో తన తలపై కొట్టారని తెలిపారు. ఆ సమయంలో రితేష్ రెడ్డితో 10 మంది ఉన్నారని, పొలిటికల్ రుబాబు చూపించుకోవడానికి తనపై దాడి చేశారని వివరించారు.
తనపై దాడి చేసిన వాళ్లను గతంలో ఎప్పుడూ చూడలేదని, ఫ్రెండ్స్ ముందు తన పవర్ చూపించుకోవాలనే ఎమ్మెల్యే తమ్ముడు ఇలా చేశాడని రాహుల్ అన్నారు. కాంటినెంటల్ హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి తాను ఇంటికెళ్లానని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేశానని, తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు వెనక్కి తీసుకొనని చెప్పారు రాహుల్.
