న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ భారత పర్యటనకు కొన్ని గంటల ముందు ఇండియా, రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అణుశక్తితో నడిచే దాడి జలాంతర్గామిని సుమారు 2 బిలియన్ డాలర్లకు రష్యా నుంచి లీజుకు తీసుకునేందుకు ఇండియా అగ్రిమెంట్ చేసుకుంది. బ్లూమ్‌బెర్గ్ ఈ విషయాన్ని నివేదించింది.
ఈ ఒప్పందంపై ఇరుదేశాల మధ్య దాదాపు 10 సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ధర కారణంగా డీల్ కుదరలేదు. రెండు రోజుల పర్యటన కోసం పుతిన్ గురువారం (డిసెంబర్ 4) ఇండియాకు రానున్న కొన్ని గంటల ముందు ఈ డీల్ కుదరడం గమనార్హం. రెండేళ్లలోపు ఈ నౌక నావికా సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఇండో-పసిఫిక్‌లో భారతదేశ వ్యూహాత్మక సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.
రష్యా నుంచి లీజుకు తీసుకున్న జలాంతర్గామిని త్వరలో ప్రారంభిస్తామని భారత నేవీ చీఫ్ దినేష్ కె త్రిపాఠి తెలిపారు. ఈ కొత్త జలాంతర్గామి ప్రస్తుతం భారత నావికాదళంలో సేవలందిస్తున్న రెండు అణుశక్తితో నడిచే నౌకల కంటే పెద్దదిగా ఉంటుందన్నారు. ఈ సబ్ మెరైన్ సముద్ర నీటి అడుగున భారత నిరోధక సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు.
►ALSO READ | 15 ఏండ్లకే PHD పూర్తి..క్వాంటం ఫిజిక్స్ లో డాక్టరేట్ అందుకున్న జర్మనీ బాలుడు
ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. రష్యన్ జలాంతర్గామిని యుద్ధ పరిస్థితుల్లో మోహరించరు. కేవలం భారత నావికాదళం సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి, అణుశక్తితో నడిచే నౌకల కార్యాచరణ విధానాలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. లీజు వ్యవధి పది సంవత్సరాలు ఉంటుంది. ఇది 2021లో ఇండియా రష్యా నుంచి లీజుకు తీసుకున్న జలాంతర్గామి మాదిరిగానే ఉంటుంది.
