కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: ఈ దేశాల నుండి ఇండియాకి వచ్చే వాళ్ళు పాస్‌పోర్ట్ లేకున్నా ఉండొచ్చు..

కేంద్ర ప్రభుత్వం కీలక  నిర్ణయం: ఈ  దేశాల నుండి ఇండియాకి వచ్చే వాళ్ళు పాస్‌పోర్ట్ లేకున్నా ఉండొచ్చు..

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి వచ్చే మైనారిటీలకు పాస్‌పోర్ట్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి ముందు భారతదేశానికి వచ్చిన హిందూ, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన అలాగే పార్సీ వర్గాల ప్రజలు పాస్‌పోర్ట్ లేకుండా భారతదేశంలో ఉండొచ్చని హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ఉత్తర్వు జారీ చేసింది.

ఈ ఉత్తర్వు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన 6 మైనారిటీల (హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు,  పార్సీలు) వారికి వర్తిస్తుంది. కానీ ఈ ఉత్తర్వుతో ఒక షరతు కూడా విధించింది. ఈ వ్యక్తులు 31 డిసెంబర్ 2024కి ముందు భారతదేశానికి వచ్చి ఉంటేనే పాస్‌పోర్ట్ లేకుండా ఇక్కడ ఉండొచ్చు. 

నేపాల్, భూటాన్ పౌరులకు కూడా :హోం మంత్రిత్వ శాఖ  ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం 2025 సోమవారం నుండి అమల్లోకి వచ్చింది. ఈ ఉత్తర్వు ప్రకారం, 1959 నుండి 30 మే 2003 మధ్య నేపాల్, భూటాన్,  టిబెట్ నుండి భారతదేశానికి వచ్చిన వలసలు వాళ్ళ  పేర్లను విదేశీ రిజిస్ట్రేషన్ అధికారి వద్ద రిజిస్టర్ చేసుకోవాలి, ఆ తర్వాత పాస్‌పోర్ట్ లేకుండా భారతదేశంలో ఉండొచ్చు. అయితే నేపాల్, భూటాన్ పౌరులు చైనా, మకావు, హాంకాంగ్ లేదా పాకిస్తాన్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తే వారికి ఈ మినహాయింపు వర్తించదు.

మతపరమైన హింస లేదా ఇతర కారణాల వల్ల ఈ మూడు దేశాల నుండి భారతదేశానికి వలస వచ్చిన వారికి హోం మంత్రిత్వ శాఖ  ఈ ఉత్తర్వు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాదు ఇప్పుడు పాస్‌పోర్టు లేకపోయినా భారత్‌ నుంచి బహిష్కరించరు.

ప్రభుత్వ నిబంధన: ఈ ఏడాది ఏప్రిల్‌లో పాస్‌పోర్ట్ లేకుండా భారతదేశానికి వచ్చే వారికీ 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చని పాస్‌పోర్ట్ నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం ఒక బిల్లును ఆమోదించింది. కానీ ఇప్పుడు కొంతమందికి ఇందులో మినహాయింపు కల్పించారు. అలాగే పాస్‌పోర్ట్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రిత్వ శాఖ సోమవారం హెచ్చరించింది.  

ఎక్కడైనా విదేశీయులు ఉంటున్న వివరాలు ప్రభుత్వానికి తెలపకపోతే రూ.1 లక్ష జరిమానా విధించబడుతుంది. అలాగే  విద్యాసంస్థలు, ఆసుపత్రులు విదేశీ విద్యార్థులు లేదా రోగుల గురించి సమాచారం ఇవ్వకపోతే రూ. 50,000 నుండి రూ.1 లక్ష వరకు జరిమానా ఉంటుంది.