ఫేక్ ​కరెన్సీ ముద్రిస్తున్న మావోయిస్టులు

ఫేక్ ​కరెన్సీ ముద్రిస్తున్న మావోయిస్టులు
  •     ఏరియా కమిటీలకు ట్రైనింగ్​
  •     కూంబింగ్​లో ప్రింటింగ్ సామాన్లు, నకిలీ నోట్లు స్వాధీనం
  •     చత్తీస్​గఢ్ రాష్ట్రం సుక్మా ఎస్పీ కిరణ్​ చౌహన్ వెల్లడి

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్ రాష్ట్రం బస్తర్ దండకారణ్యంలో మావోయిస్టులు ఫేక్​ కరెన్సీ ముద్రిస్తున్నట్లు సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ పై ప్రత్యేకంగా ఏరియా కమిటీలకు ట్రైనింగ్​ఇస్తున్నట్లుగా గుర్తించారు. కూంబింగ్​ఆపరేషన్​లో భాగంగా ఆదివారం సుక్మా జిల్లా బెజ్జి పోలీస్​స్టేషన్​పరిధిలోని కోరాజ్​గూడ వద్ద ట్రైనింగ్​క్యాంపుపై డీఆర్​జీ, బస్తర్ ఫైటర్స్, సీఆర్​పీఎఫ్ జవాన్లు దాడి చేశారు. క్యాంపులో ప్రింటింగ్​కు సంబంధించిన పలురకా వస్తువులను, రూ.43వేల నకిలీ కరెన్సీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఆర్థిక సంక్షోభంలో మావోయిస్టులు

మావోయిస్టు పార్టీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. విప్లవ కారిడార్​ రాజధాని బస్తర్​ దండకారణ్యంలోని అబూజ్​మాఢ్​ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం చక్రబంధం చేసింది. చుట్టూ భద్రతాబలగాలతో కూడిన క్యాంపులను ఏర్పాటు చేసి, మావోయిస్టు పార్టీ ఆదాయ వనరులపై ఉక్కుపాదం మోపింది. పటిష్టమైన నిఘా వ్యవస్థను బలోపేతం చేసి ఎలాంటి సాయం వారికి చేరకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత, కరోనా కాలం, భద్రతాబలగాల ఒత్తిళ్లు ఇలా ఒకదానిపై ఒకటి వచ్చి పడుతుండటంతో మావోయిస్టు పార్టీ సతమతమవుతోంది. 2022 నుంచే ఫేక్​ కరెన్సీ నోట్ల ముద్రణ చేపట్టినట్లుగా కోరాజ్​గూడ వద్ద ట్రైనింగ్ క్యాంపులో దొరికిన డాక్యుమెంట్ల ద్వారా సుక్మా పోలీసులు తెలుసుకున్నారు. ముందుగా పార్టీలోని హై క్యాడర్​కు ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ఏరియా కమిటీలకు రెండు నెలల పాటు ఫేక్​ కరెన్సీ ప్రింటింగ్ శిక్షణ ఇస్తున్నారు. ముద్రించిన ఫేక్​ కరెన్సీతో ఆదివాసీల ద్వారా వారపు సంతల్లో వారికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుసుకున్నారు. కూంబింగ్​ బలగాలను చూసి మావోయిస్టులు పారిపోగా క్యాంపులో ప్రింటర్ మిషన్, బ్లాక్ ప్రింటర్ మిషన్, ఇన్వర్టర్, ప్రింటర్ మిషన్ క్యాట్రిజ్, ఇమేజ్ కింగ్, 118 జీపీఎస్ పౌడర్ డబ్బాలు, ప్రింటర్ ఇంక్ డబ్బాలు 23, రూ.50లు, రూ.100లు, రూ.200లు, రూ.500ల ఫేక్​ కరెన్సీ శాంపిల్స్, కాలుక్యులేటర్, వైర్​లెస్ సెట్, ప్రింటర్ రోలర్, ఎలక్ట్రానిక్ క్లీనర్, రూ.43వేల ఫేక్ కరెన్సీ, బర్మార్ బందూక్​లు, బందూక్​ బైరల్స్ మొత్తం 35 రకాల వస్తువులను ట్రైనింగ్ క్యాంపు నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

భారీగా ఫేక్ కరెన్సీ ప్రింటింగ్

ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మావోయిస్టు పార్టీ ఫేక్​ కరెన్సీ ప్రింటింగ్ చేపట్టింది. మావోయిస్టు అగ్రనేతలు ప్రింటింగ్​లో ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రతీ ఏరియా కమిటీకి రెండు నెలలు ట్రైనింగ్ ఇస్తున్నారు. వారికి నిత్యం డబ్బులు, సరుకులు సప్లై చేసే టీం చైన్ లింక్​ను మేము భగ్నం చేశాం. దీంతో డబ్బులు లేక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేపట్టినట్లుగా తెలుస్తున్నది.
-కిరణ్​ చౌహాన్, సుక్మా ఎస్పీ