- 1.25 లక్షల ఇండ్లు, 630 కాలనీలకు విముక్తి
- ఏదైనా ఒక లింక్ డాక్యుమెంట్ తప్పనిసరి
- పరిష్కారానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు
- అధికారులతో పొంగులేటి భేటీ.. ఉత్తర్వులు జారీ
- సబ్ రిజిస్ట్రార్లు పరిశీలించిన తర్వాత రిజిస్ట్రేషన్లు
- జీవో 118, 76 తర్వాత మరో కీలక నిర్ణయం: పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: 22ఏ బాధితులకు ఉపశమనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్, స్థానిక సంస్థల నుంచి అనుమతి పొందిన ఇండ్లు, ఫ్లాట్లు, ఓపెన్ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పర్మిషన్ తీసుకున్న తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏదో ఒక లింక్ డాక్యుమెంట్ తప్పనిసరిగా దరఖాస్తుదారులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో కొన్నేండ్లుగా నిషేధిత ఆస్తుల జాబితాలో నలుగుతూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన దాదాపు 1.25 లక్షల ఇండ్లు, 630కి పైగా కాలనీలు, అలాగే జిల్లాల్లోని వేలాది ప్లాట్లకు శాశ్వత విముక్తి లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఆస్తులకు భరోసా దక్కడంతోపాటు రిజిస్ట్రేషన్లు కూడా జోరందుకునే అవకాశముంది.
జిల్లాస్థాయిలో కమిటీలు..
22ఏకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సందేహాలు, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా కలెక్టర్అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా రిజిస్ట్రార్, హెచ్ఎండీఏ, పురపాలక సంస్థ, గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.
22-ఏ జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఎదురయ్యే సాంకేతిక, న్యాయపరమైన చిక్కులను ఈ కమిటీ సమగ్రంగా స్టడీ చేసి తుది నిర్ణయం తీసుకుంటుంది. అర్హులైన పౌరుల నుంచి వచ్చే దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిశీలించి సమస్యలకు ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కారాలను చూపుతుంది. దీని వల్ల ప్రజలు ఆఫీసులు, కోర్టులచుట్టూ తిరగాల్సిన భారం తప్పుతుందని, స్థానికంగానే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా పనులు పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నతాధికారులతో గురువారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రభుత్వ నుంచి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజా గైడ్‌లైన్స్ ప్రకారం.. ఆయా ప్రభుత్వ సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు పొంది అభివృద్ధి చేసిన ఆస్తులకే ఈ రిజిస్ట్రేషన్ వెసులుబాటు లభిస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), ఇతర పురపాలక సంఘాలు, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ)తో పాటు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల నుంచి అధికారిక లేఅవుట్ అనుమతులు పొందిన లేఅవుట్లు, ప్లాట్లకు 22ఏ పరిధిలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తారు. అలాగే నిబంధనల ప్రకారం భవన నిర్మాణం లేదా అపార్ట్మెంట్ అనుమతులు పొంది కట్టిన నివాసాల రిజిస్ట్రేషన్లకూ పర్మిషన్ఇస్తారు.
అయితే అనుమతులు పొందాక గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి కనీసం ఒక లింక్ డాక్యుమెంట్‌ను దరఖాస్తుదారులు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్లు ఆయా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా, అసలైన లబ్ధిదారులకు త్వరగా యాజమాన్య పత్రాలు అందనున్నాయి.
ఒక్కో సమస్యనూ పరిష్కరిస్తున్నాం: పొంగులేటి
దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 22-ఏ సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతున్నామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని గుర్తుచేశారు. ‘రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లోని దాదాపు 64 కాలనీల ఇళ్ల క్రమబద్ధీకరణకు విడుదల చేసిన జీవో 118కు అనుగుణంగా మెమో జారీచేశాం. దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యను కూడా జీవో 76 ద్వారా పరిష్కరించేందుకు నిర్ణయించాం’ అని తెలిపారు.
తమ భూములు, ఇండ్లపై హక్కుల కోసం ప్రజలు ఏండ్ల తరబడి ప్రభుత్వ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరిగే దుస్థితికి ముగింపు పలకడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. 22-ఏలోని అన్ని భూములను ఒకే గాటన కట్టకుండా, భూమి స్వభావం, అందుబాటులో ఉన్న రికార్డులు, చట్టబద్ధమైన అనుమతులు, న్యాయపరమైన అంశాలను పరిశీలించాక అత్యుత్తమ పరిష్కారం చూపుతామని మంత్రి స్పష్టం చేశారు.
