న్యూఢిల్లీ: ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ను దేశీయ పోటీల్లో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటిస్తూ రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాబోయే ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో ఆమె పాల్గొనేలా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది.
ఇంటర్నేషనల్ బాడీ నుంచి అనుమతి ఉన్నప్పటికీ వినేశ్‌ను ట్రయల్స్‌లో పాల్గొనకుండా అడ్డుకోవడం సరికాదని తప్పుబట్టింది. ప్రసవ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగాలని భావిస్తున్న వినేశ్ ఇంటర్నేషనల్ స్థాయి రెజ్లర్ అని, తల్లి అయినందుకు ఆమెను పక్కనపెట్టడం తగదని కోర్టు హితవు పలికింది.
మన దేశంలో మాతృత్వాన్ని గౌరవిస్తారని, సమాఖ్య కక్షసాధింపు ధోరణితో వ్యవహరించకూడదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ అంశంపై సోమవారం తదుపరి విచారణ జరపాలని, ఈలోగా సమాఖ్యకు విజ్ఞప్తి చేసుకునేలా వినేశ్‌కు సూచించాలని డబ్ల్యూఎఫ్‌ఐ తరఫు న్యాయవాది కోరగా.. తామే నేరుగా ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
