HHVM: ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి పెద్ద కండీషనే పెట్టిన పోలీసులు

HHVM: ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి పెద్ద కండీషనే పెట్టిన పోలీసులు

హైదరాబాద్: పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు పోలీసు శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు పోలీసులు అనుమతి ఇచ్చారు. హైదరాబాద్ నగరంలోని శిల్ప కళా వేదికలో సోమవారం సాయంత్రం ఈ ఈవెంట్ జరగనుంది. అయితే.. ప్రీరిలీజ్ ఈవెంట్కు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.

వెయ్యి నుంచి 15 వందల మందికి మాత్రమే అనుమతి ఉందని నిర్వాహకులకు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలని పోలీసుల కండిషన్ పెట్టారు. శిల్ప కళా వేదిక లోపల నిండిపోయి.. పాసులు లేక బయట ఉండిపోయే అభిమానులను మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవాలని పోలీసులు నిర్మాతకు, నిర్వాహకులకు సూచించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు క్లియర్ కట్గా చెప్పేశారు. పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వస్తుండటంతో అభిమానులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పర్మిషన్ ఇచ్చే విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పుష్ప-2 తర్వాత విడుదలైన చాలా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హోటల్స్లో జరిగాయి.

భారీగా తరలివచ్చే అభిమానుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవాలని భావించే మేకర్స్ ఏపీలో కొన్ని ఈవెంట్స్ చేసుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ ఏపీలోనే జరిగింది. ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈవెంట్ తర్వాత తిరిగి వెళుతుండగా పవన్ అభిమాని బైక్పై అతి వేగంగా వెళుతూ అదుపు తప్పి ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ జరిగే ఈవెంట్ల విషయంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

ఇక.. HHVM సినిమా విషయానికొస్తే.. దర్శకుడు జ్యోతికృష్ణ రెండు భాగాలుగా రూపొందిస్తున్న హరిహర వీర మల్లు ఫస్ట్ పార్ట్  జులై 24న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల కానుంది. ‘ఖుషి’, ‘బంగారం’ సినిమాల తర్వాత పవన్ కల్యాణ్, నిర్మాత ఏఎం రత్నం కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో  పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనిపిస్తారు. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా, పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అందరి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే గొప్ప చిత్రంగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.