బిగ్బాస్ ఓటీటీ ప్రోమోతో అదరగొట్టిన నాగ్ 

బిగ్బాస్ ఓటీటీ ప్రోమోతో అదరగొట్టిన నాగ్ 

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్బాస్ ఓటీటీకి ముహూర్తం ఖరారైంది. షో ప్రారంభానికి సంబంధించి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తాజా అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 26 నుంచి ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ మేరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రోమో రిలీజ్ చేసింది. టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ షోలాగా కేవలం గంట కాకుండా 24x7 పాటు ఈ షో కొనసాగనుంది.

నాగార్జున, వెన్నెల కిషోర్, మురళీ శర్మలతో రూపొందించిన ప్రోమో అందరినీ అలరిస్తోంది. ప్రోమోలో లాయర్గా నాగార్జున కనిపించగా.. ఉరిశిక్షపడ్డ ఖైదీగా వెన్నెల కిషోర్, జైలర్గా మురళీ శర్మ నటించారు. ఉరికంబం దగ్గర నిలబడ్డ వెన్నెల కిషోర్ను జైలర్ చివరి కోరిక ఏదైనా ఉందా అని అడగగా.. బిగ్ బాస్ షో ఒక్క ఎపిసోడ్ చూస్తాడట సార్ అంటూ నాగార్జున చెబుతాడు. అందుకు జైలర్ పర్మిషన్ ఇస్తాడు. గంటలు గడుస్తున్నా బిగ్బాస్ ఎపిసోడ్ పూర్తికాక పోగా చివరకు జైలర్ కూడా ఆసక్తితో ఓటీటీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో చూస్తూ ఉండిపోతాడు. 

నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న బిగ్బాస్ ఓటీటీ హోస్ట్ విషయంలో ఊహాగానాలకు నిర్వాహకులు తెరదించారు. ఓటీటీ షోను నాగార్జున హోస్ట్ చేస్తారని ప్రోమోతో కన్ఫామ్ చేశారు. 26న ప్రారంభం కానున్న ఈ బిగ్ బాస్ ఓటీటీలో గత సీజన్ల కంటెస్టెంట్లు కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.