మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పళ్లిచట్టంబి’. కయాదు లోహర్ హీరోయిన్. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగులో రిలీజ్ చేస్తున్న బన్నీ వాస్ మాట్లాడుతూ ‘మలయాళం మూవీస్ అంటే మనం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌గానే భావిస్తాం. కానీ ఇదొక భారీ కమర్షియల్ మూవీ. తెలుగులో పెద్ద విజయం సాధిస్తుంది’ అని అన్నారు.
టొవినో థామస్ మాట్లాడుతూ ‘50వ దశకం నేపథ్యంగా సాగే చిత్రమిది. అప్పటి పరిస్థితులను రీ క్రియేట్ చేసేందుకు చాలా రీసెర్చ్ చేశాం. ప్యాషనేట్ టీమ్‌తో ఈ మూవీ రూపొందించాం. అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పాడు. హీరోయిన్ కయాదు లోహర్ మాట్లాడుతూ ‘ఇది నాకు స్పెషల్ మూవీ. ఇందులో రెబెకా అనే క్యారెక్టర్‌లో నటించా. ఈ పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది. ఒకరకంగా ఇది నాకు డ్రీమ్ రోల్ లాంటిది’ అని చెప్పింది.
డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనీ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సింపుల్ స్టోరీ ఇది. మనుషులంతా ఒక్కటే అనేది ఈ మూవీ ప్రధాన కథాంశం. పళ్లిచట్టంబి అనేది ఒక స్లోగన్. కథలో టైటిల్ రోల్. అందుకే ప్రతి భాషలోనూ ఇదే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నాం’ అని చెప్పాడు. తమ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు చాణక్య, చైతన్య, చరణ్ అన్నారు. నటుడు శత్రు, లిరిసిస్ట్ రాంబాబు గోసాల, అసోసియేట్ ప్రొడ్యూసర్ మేఘశ్యామ్ పాల్గొన్నారు.
