ఆకలి బాధ తెలుసు.. అందుకే సాయం!

ఆకలి బాధ తెలుసు.. అందుకే సాయం!

కథ వేరే ఉంటది – ఈ  డైలాగ్ సయ్యద్​ సోహెల్​ లైఫ్​ని టర్న్​ చేసింది. తనలోని మాస్​ మేనరిజమ్​ని ఎలివేట్​ చేసి బిగ్​బాస్​ ఫైనల్స్​ వరకు తీసుకెళ్లింది​. బిగ్​బాస్​​తో వచ్చిన పేరును ఆపదలో ఉన్న పసివాళ్ల కోసమే ఉపయోగిస్తున్నాడు ఈ ఆర్టిస్ట్. ‘సోహీ హెల్పింగ్​ హ్యాండ్స్’ అనే ఫౌండేషన్ ​ద్వారా పిల్లల ప్రాణాలు నిలబెడుతున్నాడు. ఈ ప్యాండెమిక్​లో పేదవాళ్లకి మూడు పూటల తిండి పెడుతున్నాడు. ఉచితంగా సరుకులు ఇస్తున్నాడు. ప్రాణం, ఆకలి విలువ తెలుసు కాబట్టే ఇదంతా చేస్తున్నా అంటున్న సోహెల్​ మాటల్లోనే మరిన్ని వివరాలు..​.

‘‘పెద్దపల్లి జిల్లా, మారేడుగొండ మా సొంతూరు. నేను సింగరేణి కార్మికుడి బిడ్డని. ఐదుగురు పిల్లలున్న మా కుటుంబానికి నాన్న ఒక్కడే ఆధారం. ఆయన సంపాదనతోనే కుటుంబ ఖర్చులన్నీ వెళ్లదీయాలి. పైగా మా  చదువుల భారం. ముగ్గురు ఆడపిల్లల పెళ్లి బాధ్యత. ఏ రోజు బియ్యం ఆరోజు  కొనుక్కొచ్చి మా కడుపు నింపిన రోజులన్నయ్​. అయినా సరే, నాన్న తను పడుతున్న కష్టం గురించి ఏనాడూ మాతో మాట్లాడేవాడు కాదు.  నా యాక్టింగ్​ కల నిజం చేసుకోవడానికి వారసత్వంగా సింగరేణిలో వచ్చిన ఉద్యోగాన్ని వద్దనుకున్నా. అప్పుడు కూడా అడ్డు చెప్పలేదు అమ్మానాన్న. నా కల నెరవేర్చుకునేందుకు సిటీకొచ్చా. అప్పుడు తెలిసింది ఆకలి విలువ. అప్పట్లో నేను పడిన ఇబ్బందే ఇప్పుడు పదిమంది కడుపు నింపాలన్న ఆలోచనకి కారణమైంది.

పచ్చళ్లు తిన్నా...

తొమ్మిదో తరగతిలో ‘డాన్స్​ బేబీ డాన్స్​’ షోలో పార్టిసిపేట్​ చేశా. అది తప్పించి సినిమా ప్రపంచం గురించి ఏం తెలీదు. తెలిసిన వాళ్లూ లేరు. చావైనా బతుకైనా సినిమానే అనుకున్నా. ప్రతినెలా నాన్న  3,500 పంపించేవాళ్లు. సరిపోయేవి కావు. ఇంకా కావాలని అడగలేని పరిస్థితి. ఇంటి నుంచి బియ్యం వచ్చేవి. కూరగాయలకి డబ్బులు ఉండేవి కావు. వరుసగా మూడునాలుగు రోజులు పచ్చళ్లతోనే తిన్న రోజులు ఉన్నాయి​. రూంలో​ రూపాయి, రెండు రూపాయలు వెతుక్కుని గుడ్డు తెచ్చుకుని కడుపునింపుకున్న రోజులు ఉన్నాయి. క్యాటరింగ్ బాయ్​గా చేస్తే రోజుకి 200 రూపాయలు వచ్చాయి. నెలకి 7,500 రూపాయల జీతానికి జూనియర్​ అకౌంటెంట్​గా ఉద్యోగం కూడా చేశా. అలా కష్టపడటం వల్ల మనం సంపాదించే దాన్లో మన అవసరాలకి సరిపడా డబ్బు ఉంచుకుంటే చాలు అనిపించింది. అందుకే నా సంపాదనలో కొంత భాగాన్ని పసిపిల్లల కోసం ఇవ్వాలని డిసైడ్​ అయ్యా. ఆ ఆలోచనతోనే బిగ్​బాస్​ నుంచి బయటికొచ్చాక ప్రైజ్​ మనీలో పదిలక్షలు ఆర్ఫనేజ్​ సంస్థలకు ఇచ్చా. ‘సోహీ హెల్పింగ్​ హ్యాండ్స్’ని మొదలుపెట్టా. ఇలా నేను ఆలోచించడానికి కారణం నా ఫ్రెండ్​ కూతురు.

ఆ మాట మర్చిపోలేను

సినిమా ప్రయత్నాల్లో ఉన్న టైంలో నా బెస్ట్​ ఫ్రెండ్​కి కూతురు పుట్టింది. పుట్టిన వారం రోజులకే ఆ పాపకి ఆపరేషన్​ చేయాల్సి వచ్చింది. అందుకు పది లక్షలు ఖర్చవుతుంది అన్నారు. అంత డబ్బు పెట్టి ట్రీట్​మెంట్​ చేయించే స్థోమత నా ఫ్రెండ్​కి లేదు. దాంతో ఆ టైంకి నా అకౌంట్​లో ఉన్న డబ్బు చేతికిచ్చా. సోషల్​ మీడియాలో పాప కోసం స్టేటస్​లు, పోస్ట్​లు​ పెట్టా. తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేశా. రోజుకి రెండుమూడు గంటలు మాత్రమే నిద్రపోయేవాడ్ని. అలా పన్నెండు రోజుల్లో పాప ఆపరేషన్​కి సరిపడా డబ్బు కలెక్ట్​ చేశా. అప్పుడు నా ఫ్రెండ్​ ‘నా కూతురు బతికున్నంత కాలం తనలో నువ్వే కనిపిస్తావ్​ రా’ అన్నాడు. ఈ జీవితానికి ఆ మాట చాలనిపించింది. ఆ పాప లాంటి మరికొందరికి సాయం చేయాలనిపించి ‘సోహీ హెల్పింగ్​ హ్యాండ్స్​’ ని జనవరి 15న​ స్టార్ట్​ చేశా. 

సక్సెస్​ఫుల్​గా..

ఆపదలో ఉన్నవాళ్లందరికీ సాయం చేయాలని ఉంటుంది. కానీ అంత బరువు నేను మోయలేను. మరికొందరు కలిస్తే వీలైనంత ఎక్కువమందికి సాయం చేయగలుగుతా. అలానే నా ఫౌండేషన్​ ద్వారా ఫండ్స్​ రైజ్​ చేసి అవసరం ఉన్న వాళ్లకి ట్రీట్​మెంట్​ చేయిస్తున్నా. దీనికి నా ఫ్యాన్స్​ అంతా​ సపోర్ట్​ చేస్తున్నారు. ప్రతి నెలా వాళ్ల జీతం నుంచి ఐదు లేదా పది శాతం ఇస్తున్నారు. అలా అందరి సహకారంతో ఇప్పటివరకు నాలుగు ఆపరేషన్స్​ చేయించగలిగా. అలాగే ఈ ప్యాండెమిక్​ టైంలో పేదవాళ్లకి ఫుడ్, సరుకులు కూడా ఇస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్లకి చేతనైనంత సాయం చేస్తున్నాం.

అదే గోల్​

బిగ్​బాస్​లో పార్టిసిపేట్​ చేయడం వల్ల నాకొచ్చింది రికగ్నైజేషన్​ మాత్రమే. కానీ నేను చేసిన సినిమా హిట్​ అయితేనే నాకు సక్సెస్​ వచ్చినట్టు. ‘జార్జి​ రెడ్డి’, ‘ప్రెషర్​ కుక్కర్’ లాంటి సినిమాలు తీసిన​ అప్పిరెడ్డిగారి ప్రొడక్షన్​లో ఒక సినిమా చేస్తున్నా. షూటింగ్​ 50 శాతం పూర్తయ్యింది. లక్కీ మీడియాలో బెక్కం వేణు గోపాల్​, గ్లోబల్​ ఫిల్మ్స్​తో కలిసి ఒక సినిమా చేస్తున్నా.ఈ సినిమాల ద్వారా వచ్చే డబ్బులో కొంతభాగాన్ని సోహీ హెల్పింగ్​ హ్యాండ్స్​కి ఖర్చు చేస్తా. వీలైనంత ఎక్కువమందికి సాయం చేసేందుకు ట్రై చేస్తా. ప్రస్తుతానికి ఇవే నా ముందున్న గోల్స్​.
- ఆవుల యమున